గోల్కొండ: ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనంలో కొనసాగుతున్న ఓ పాఠశాలను సోమవారం విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. డిప్యూటీ ఈవో సి.హెచ్.వెంకటరమణ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసుల సమక్షంలో విద్యార్థులందరినీ ఇంటికి పంపి పాఠశాల గేట్లకు తాళం వేశారు. గత సంవత్సరం ప్రారంభమైన ఈ పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేవని డిప్యూటీ ఈవో తెలిపారు. విద్యా శాఖ ఆర్‌జేడీ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు స్కూల్‌ను సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఐదంతస్తుల భవనంలో కొనసాగుతున్న ఈ పాఠశాలకు అగ్నిమాపక విభాగం అధికారుల అనుమతులు లేవని తెలిపారు. ట్రాఫిక్ అధికారులు, బల్దియా విభాగం నుంచి ఎలాంటి అనుమతులు లేవని, పాఠశాలకు గుర్తింపు సైతం లేదన్నారు. పలుమార్లు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌ను అనుమతుల విషయమై హెచ్చరించామని, అయినా యాజమాన్యం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 2న పాఠశాల ప్రిన్సిపాల్, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి, అనుమతులు లేనందున సదరు పాఠశాలలో పిల్లలను చేర్పించవద్దని ఇక్కడ ఉన్న పిల్లలను వేరే పాఠశాలలోకి మార్చుకోవాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనమేరకు పాఠశాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ ఐఓఎస్ మహ్మద్ బషీర్‌తో పాటు విద్యాశాఖకు చెందిన సయ్యద్ జాఖేర్, మహ్మద్ నసీర్ తదితరులున్నారు.
విద్య పేరుతో దోపిడీ...
ఆర్చీడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం పిల్లల భద్రతను గాలికి వదిలేసి ఫీజుల పేరిట దోపిడీ చేస్తుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలను సీజ్ చేసినట్లు తెలియడంతో నానల్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. గేట్లకు తాళం వేసి ఉండడం చూసి స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేలల్లో ఫీజులు చెల్లించామని విద్యా సంవత్సరం చివరలో తమ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని విద్యాశాఖ అధికారులను నిలదీశారు. వచ్చే నెలలో పరీక్షలు ఉన్నాయని దాని కోసం పిల్లలు కష్టపడి చదువుతున్నారని ఇప్పుడు పాఠశాలకు తాళం వేస్తే వారి పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవన్న విషయం తమకు తెలియదని ప్రభుత్వ గుర్తింపు ఉందని ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం చెబుతూ వచ్చిందని వారు ఆరోపించారు.
అనుమతులు లేకుండా నిర్వహణ
పలు మార్లు విద్యాశాఖ అధికారుల హెచ్చరికలు
పట్టించుకోని స్కూల్ యాజమాన్యం