
బెట్టింగ్‌కు
సాక్షి, సిటీబ్యూరో: గతంలో ఎన్నడూ లేని ఉత్కంఠ మధ్య పూర్తయిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగులు జోరుగా సాగాయి. కేవలం రాష్ట్రానికి చెందిన వారే కాకుండా పొరుగు రాష్ట్రాల బుకీలు, పంటర్లు రంగంలోకి దిగుతున్నారు. వీటి కట్టడి చేయడం కోసం పోలీసులు ఓ కీలక చర్య తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇప్పటి వరకు బుకీలపై (పందేలు అంగీకరించే వారు) మాత్రమే నమోదు చేస్తున్న కేసుల్లో ఇకపై పంటర్లనూ (పందేలు కాసే వ్యక్తులు) నిందితులుగా చేర్చాలని యోచిస్తున్నారు. దీనికి చట్టంలో ఉన్న వెసులుబాటుపై అధ్యయనం చేయనున్నారు.
ఇక్కడ పట్టు బిగిస్తే అక్కడకు...
ఎన్నికలు కావచ్చు క్రికెట్ సహా ఇతర క్రీడలు కావచ్చు బుకీలకు–పంటర్లకు మధ్య అవినాభావ సంబంధం ఉంటోంది. ఈ జూదం నమ్మకం మీద సాగిపోయేది కావడంతో పరిచయస్తులే ఎక్కువగా ఉంటారు. కొత్తగా బుకీలుగా మారే వారు సైతం గతంలో ప్రధాన బుకీల వద్ద పని చేసిన వారై ఉంటారు. వీళ్లు తమ యజమానికి చెందిన కస్టమర్లలో కొందరిని తమ వైపు లాక్కుంటారు. వీరి ద్వారా పరిచయమైన వారినే కొత్త కస్టమర్లుగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే సిటీలో పోలీసులు ఉక్కుపాదం మోపితే బయటి నగరాలు/రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న బుకీలు తమ రెగ్యులర్ పంటర్ల సాయంతో యథేచ్ఛగా ‘ఆన్‌లైన్ దందా’ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంటర్లకు చెక్ చెబితే తప్ప బెట్టింగ్ దందాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం సాధ్యం కాదని పోలీసుల నిర్ణయించారు. పందెం కాసేవాళ్లే లేకపోతే అంగీకరించే వారూ ఉండరని భావిస్తున్నారు. దీనికోసం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు.
పక్కాగా దొరుకుతున్న ఆధారాలు...
బెట్టింగ్ ముఠాలను టాస్క్‌ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్‌్ టీమ్ (ఎస్వోటీ) బృందాలతో పాటు స్థానిక పోలీసులూ పట్టుకుంటున్నారు. ఇలాంటి ముఠాలు/వ్యక్తుల నుంచి పోలీసులు నగదుతో పాటు టీవీలు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, బెట్టింగ్ స్లిప్స్, పుస్తకాలు తదితరాలు స్వాధీనం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అధికారులు కొన్ని రికార్డులూ గుర్తిస్తుంటారు. వీటిలో నిందితులు తమ వద్ద పందేలు కాసిన వారి పేర్లు, ఫోన్ నంబర్లతో పాటు వారు దేనిపై, ఎంత మొత్తం పందెం కాశారనేది నమోదు చేసి ఉంచుతారు. పంటర్ల వద్ద దొరికిన ల్యాప్‌టాప్స్ విశ్లేషిస్తే మరికొందరు పంటర్ల పేర్లూ బయటి వస్తాయి. ఓ బుకీని అరెస్టు చేస్తే పంటర్లు మరో బుకీ వద్ద పందేలు కాసే అవకాశం ఉందని భావించిన పోలీసులు పంటర్ల పైనా కఠిన చర్యలకు నిర్ణయించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డుల్నే ఆధారంగా చేసుకుని పంటర్లనూ నిందితులుగా చేర్చాలని యోచిస్తున్నారు.
నోటీసుల జారీకి అవకాశం..
● క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో పందేలు కాసే వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. వీరి బెట్టింగులకు బానిసలుగా మారారనే విషయం అనేక మంది తల్లిదండ్రులకు తెలియదు. వీరిని కట్టడి చేస్తేనే బుకీలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు పంటర్లనూ నిందితుల జాబితాలో చేర్చాలని భావిస్తున్నారు. వీరిని అరెస్టు చేసే ఆస్కారం లేకపోయినా నోటీసులు పంపాలని యోచిస్తున్నారు. ఫోన్ నంబర్ల ఆధారంగా చిరునామాలు గుర్తించి, సీఆర్‌పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేయడానికి అవకాశాలు పరిశీలిస్తున్నారు.
● ఫలితంగా కుటుంబీకులకూ వీరు పంటర్లనే విషయం తెలియడంతో పాటు వీరి ఆగడాలకు అడ్డుపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘పందేలు కాసే వారు ఉన్నంత కాలం బుకీలు పుట్టుకు వస్తూనే ఉంటారు. నగరంలో దాడులు ముమ్మరం చేస్తే గోవా, ముంబై వంటి ప్రాంతాలకు వెళ్లి వ్యవస్థీకృతంగా వ్యవహారం నడుపుతున్నారు. పంటర్లను కట్టడి చేస్తే బుకీల వ్యవహారాలకు అడ్డుకట్ట పడుతుంది. అందుకే కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నాం’ అని అన్నారు.
పందెం కాసినవాళ్లూ నిందితులే!!
ఇప్పటి వరకు కేవలం అంగీకరించిన వారే అరెస్టు
ఇకపై పంటర్లపైనా చర్యలకు పోలీసులు సిద్ధం
ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు
