
హైదరాబాద్: హైదరాబాద్ మహానగర స్థిరాస్తి రంగానికి కరోనా బాగా కలిసొచ్చింది. కోవిడ్ కంటే ముందు నగరంలో కొత్త గృహాల సరఫరా కంటే విక్రయాలు దాదాపు రెండింతలు జరిగేవి. కానీ.. మహమ్మారి అనంతరం రివర్స్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా కంటే ముందుతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల సరఫరా, విక్రయాలు మూడు రెట్లు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటివరకు నగరంలో కొత్తగా 1,02,434 గృహాల సరఫరా జరగగా.. 70,718 ఇళ్లు అమ్ముడుపోయాయి. అదే కరోనా కంటే ముందు 2018 నుంచి 2020 వరకు నగరంలో 31,725 యూనిట్లు సప్లయ్ కాగా.. 41,900 నివాసాలు విక్రయమయ్యాయి.
ఇంటి అవసరం పెరిగింది..
కరోనాతో ఇంటి అవసరం పెరిగింది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో నివాసం ఉండే ఇళ్లు కూడా పర్యావరణహితంగా ఉండాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా విస్తారమైన ఇళ్లు, ఆధునిక వసతులను డెవలపర్లు కల్పిస్తున్నారు. ఔట్ డోర్ జిమ్, ఐసోలేషన్ గది, వర్క్ ఫ్రం హోమ్, ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం 24/7 ఇంటర్నెట్, ఇండిపెండెంట్ వసతుల ఏర్పాట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం ఇళ్లకు గిరాకీ పెరిగింది.
పశ్చిమ హైదరాబాద్‌లో గిరాకీ..
చాలా మంది కొనుగోలుదారులు కొత్త ప్రాపర్టీలే కాకుండా సెకండ్ హ్యాండ్ ఇళ్లను కొనుగోలు చేశారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ రంగంలో మూడింట ఒక వంతు ఉద్యోగులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పశ్చిమ హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రధానంగా గచ్చిబౌలి, మాదాపూర్, శేరిలింగంపల్లి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నల్లగండ్ల, తెల్లాపూర్, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలో కొనుగోళ్లు పెరిగాయి. ఇదే సమయంలో హైదరాబాద్‌కు వలసలు పెరగడంతో ఇక్కడి ప్రాపర్టీలకు గిరాకీ కొంత మేర పెరిగింది.
ఆఫీసు స్పేస్‌లో టాప్..
దేశంలోని ఏడు ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఈ ఏడాది మూడో త్రైమాసికం (క్యూ3)లో అత్యధికంగా ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. 2023 క్యూ3లో 27 లక్షల చదరపు అడుగులు (చ.అ.) లావాదేవీలు పూర్తయ్యాయి. హైదరాబాద్ తర్వాత బెంగళూరులో 23.8 లక్షల చ.అ. లీజులు జరిగాయి. 2023 క్యూ2తో పోలిస్తే నగరంలో ఆఫీసు స్పేస్ లావాదేవీలలో ఏకంగా 206 శాతం వృద్ధి నమోదయిందని జేఎల్‌ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది క్యూ2లో 8 లక్షల చ.అ. లీజులు మాత్రమే జరిగాయి. దేశంలోని మొత్తం ఆఫీసు స్పేస్ లావాదేవీలలో 26.1 శాతం వాటాతో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. బెంగళూరు 22.9 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్ 16.4 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. 2023 క్యూ3లో 10.37 మిలియన్ చ.అ. లావాదేవీలు జరిగాయి. గత 18 నెలలతో పోలిస్తే గరిష్ట లావాదేవీలివే. 2023 క్యూ2లో 7.95 మిలియన్ చ.అ. లావాదేవీలు జరిగాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే 30.4 శాతం వృద్ధి నమోదయింది.
రెడీ టు మూవ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల కంటే నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. స్థిరమైన వడ్డీ రేట్లు, అందుబాటు ధరలు గృహ విభాగంలో డిమాండ్‌కు ప్రధాన కారణాలు. – సీహెచ్ వెంకట సుబ్రహ్మణ్యం, సీఎండీ, భువన్‌తేజ ఇన్‌ఫ్రా