హుస్సేన్‌సాగర్‌ తీరంలో మరో అందమైన పార్కు | Sakshi
Sakshi News home page

హుస్సేన్‌సాగర్‌ తీరంలో మరో అందమైన పార్కు

Published Wed, Sep 20 2023 6:04 AM

- - Sakshi

హైదరాబాద్: మహా నగరంలోనే ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన హుస్సేన్‌సాగర్‌ తీరంలో మరో అందమైన పార్కు రూపుదిద్దుకుంది. ఒకవైపు అమరుల స్మారకం, మరోవైపు శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హుస్సేన్‌సాగర్‌ సుందరీకరణలో భాగంగా జలవిహార్‌ సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.26.65 కోట్లతో హెచ్‌ఎండీఏ లేక్‌వ్యూ పార్కును అభివృద్ధి చేసింది. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో వెల్లడించారు.

విశేషాలెన్నో..
► ఈ పార్కులో ఎలివేటెడ్‌ వాక్‌వేస్‌ను ఏర్పాటు చేశారు. ఈ వాక్‌వేలపై నడుస్తుంటే హుస్సేన్‌సాగర్‌ జలాశయంలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒక్కొక్కటి 110 మీటర్ల చొప్పున 4 ఎలివేటెడ్‌ వాక్‌వేలు ఉన్నాయి. పార్కులో అన్ని వైపులా వెళ్లేలా వాక్‌వేలను ఏర్పాటు చేశారు.

► అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో అభివృద్ధి చేసిన ఈ పార్కులో పెవిలియన్స్‌, పంచతత్వ వాక్‌వే, సెంట్రల్‌ పాత్‌వే, అండర్‌ పాస్‌లు ఉన్నాయి. జలాశయంపై 15 మీటర్ల పొడవైన డెక్‌ ఉంటుంది. కాంటిలివర్‌, పర్గోలాస్‌, విద్యుత్‌ కాంతులతో అందంగా ఆకట్టుకొనే శిల్పాలు సందర్శకులకు వింత అనుభూతిని కలిగిస్తాయి. ఇల్యుమినేషన్‌ బొలా ర్డ్స్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌, హైమాస్ట్‌ లైటింగ్‌, నియో ఫ్లెక్స్‌లైటింగ్‌ వంటి విద్యుత్‌ కాంతుల నడుమ బోర్డ్‌ వాక్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది.

అందమైన ల్యాండ్‌స్కేప్‌....

► లేక్‌వ్యూ పార్కును పచ్చదనం ఉట్టిపడేలా అందమైన ల్యాండ్‌స్కేప్‌తో అభివృద్ధి చేశారు. ఆర్కిటెక్‌ డిౖజైన్‌లలో సుమారు 4 లక్షల మొక్కలను నాటినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. 25 ఏళ్ల వయసున్న 22 చెట్లను ఈ పార్కులో విజయవంతంగా ట్రాన్స్‌లొకేట్‌ చేశారు. మరో 40 అరుదైన మొక్కలను నాటారు.

► పార్కు అభివృద్ధి కోసం రూ.22 కోట్లు ఖర్చు కాగా, ల్యాండ్‌స్కేప్‌, ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ కోసం మరో రూ.4.65 కోట్లు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు.

ఎంట్రీ టికెట్‌ ఇలా..

► లేక్‌వ్యూపార్కు ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. పిల్లలకు రూ.10, పెద్దలకు రూ.50 చొప్పున ప్రవేశ రుసుం. వాకర్స్‌ నెలకు రూ.100 చొప్పున చెల్లించాలి.

Advertisement
 
Advertisement