
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు (ఫైల్)
అనురాధ కేసు..
ఈ కోణంలో ముందుకు వెళ్లకే అనేక కేసులు క్లోజ్
● ఏళ్లుగా కొలిక్కి చేరని అతి దారుణ హత్యలు ఎన్నో
● 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు బి.చంద్రమోహన్
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని బహిరంగ ప్రదేశాల్లో లభించిన గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన హత్య కేసుల్లో మూసీ ఒడ్డున దొరికిన మాజీ హెడ్–నర్సు వై.అనురాధదీ ఒకటి. ఈ కేసును మలక్‌పేట పోలీసులు రోటీన్‌కు భిన్నంగా దర్యాప్తు చేశారు. సుదీర్ఘమైన ఈ ప్రక్రియను చాలా వేగవంతంగా పూర్తి చేశారు. సీన్ కట్ చేస్తే... ఈమె తల లభించిన పది రోజుల్లోనే నిందితుడైన బి.చంద్రమోహన్‌ను అరెస్టు చేసి హతురాలిని గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో అధికారులు ‘అక్యూజ్డ్ టు డిసీజ్డ్’ విధానం అవలంబించారు.
సాధారణంగా మూస ధోరణే...
నగరంలోని వివిధ ప్రాంతాల్లో తరచూ గుర్తుతెలియని మృతదేహాలు లభిస్తూనే ఉంటున్నాయి. వీటిలో కొన్నింటిని హత్యలుగా నిర్ధారిస్తున్న పోలీసులు ఆ మేరకు కేసులు నమోదు చేస్తున్నారు. వీటి దర్యాప్తులో మాత్రం మూస ధోరణి వ్యవహరిస్తున్నారు. సాంకేతికంగా హత్య కేసుల్లో నిందితులను అక్యూజ్డ్ అని, హతులను డిసీజ్డ్ అని సంబోధిస్తారు. ప్రతి కేసులోనూ దర్యాప్తు అధికారులు తొలుత హతులను గుర్తించడం పైనే దృష్టి పెడుతున్నారు. వీళ్లు ఎవరన్నది తెలిస్తే పూర్వాపరాలు, గత చరిత్ర తదితరాలను అధ్యయనం చేస్తే నిందితులు తేలిగ్గా దొరుకుతారన్నది అధికారుల భావన. ఈ కారణంగానే ‘గోల్డెన్ టైమ్’గా పిలిచే కేసు నమోదైన తొలి నాళ్లల్లో హతులపైనే దృష్టి పెడుతున్నారు. ఈ విధానం అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే ఫలితాలు ఇస్తోంది. అనేక కేసులు హతులు, హంతకులు కూడా తెలికయ పెండింగ్‌లో ఉండిపోవడం, క్లోజ్ కావడం అవుతోంది.
ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో...
గుర్తుతెలియని మహిళ హత్యగా నమోదైన అనురాధ కేసు దర్యాప్తు ప్రారంభించిన మలక్‌పేట అధికారులు తొలుత ‘డిసీజ్డ్ టు అక్యూజ్డ్’ విధానాన్నే అవలంబించారు. రాజధానిలోని మూడు పోలీసు కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 735 పోలీసుస్టేషన్ల నుంచి నమోదవుతున్న మిస్సింగ్ కేసుల వివరాలు ప్రతి పూటా సేకరించారు. దర్పణ్ యాప్ ద్వారానూ ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించారు. సీఐడీ, ఉమెన్ సేఫ్టీ వింగ్, స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలను సంప్రదించి హతురాలి వివరాలు ఆరా తీశారు. ఆమె ఫొటోతో పోస్టర్లు ముద్రించి మలక్‌పేట చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు అనేక చోట్ల వాటిని ఉంచి ప్రయత్నాలు చేశారు. ఇవేవీ ఫలితం ఇవ్వకపోవడంతో వెంటనే మేల్కొన్న అధికారులు తమ పంథా మారుస్తూ ‘అక్యూజ్డ్ టు డిసీజ్డ్’ విధానంలోకి మారారు.
ఎనిమిది రోజుల ఫుటేజ్ అధ్యయనం..
● తొలుత నిందితుడిని గుర్తించడంపై దృష్టి పెట్టి సీసీ కెమెరాల్లోని ఫీడ్ సేకరించారు. తల దొరికిన ప్రాంతానికి అటు ఇటు 300 మీటర్ల పరిధిలో ఉన్న కెమెరాలను ఎంచుకున్నారు. ఈ నెల 10 నుంచి 17 వరకు వాటిలో రికార్డు అయిన ఫీడ్ మొత్తం పరిశీలించారు. ఇలా మొత్తం 54 అనుమానిత వాహనాలను గుర్తించారు. వీటిలో ఏదో ఒకటి నిందితుడు వాడి ఉంటాడని ముందుకు వెళ్లి చంద్రమోహన్‌ను పట్టుకున్నారు.
● మలక్‌పేట పోలీసులు బుధవారం అరెస్టు అయిన నిందితుడు బి.చంద్రమోహన్‌ను మలక్‌పేట పోలీసులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచి, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు సేకరించడానికి, హత్య పూర్తి కారణాలు నిర్ధారించడానికి నిందితుడిని లోతుగా విచారించాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం పది రోజుల పోలీసు కస్టడీకి అనుమతివ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఇలాంటి ఎన్నో కేసులు ఇప్పటికీ కొలిక్కి చేరలే...
మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లో షెల్టర్ నెం.3 వద్దకు 2010 ఆగస్టు 3న లభించిన సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం.
సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలోని రామ్‌కోఠి చౌరస్తా, నారాయణగూడల్లో 2010 డిసెంబర్ 20, 22 తేదీల్లో ముక్కలుగా లభించిన తల లేని యువకుడి మృతదేహం.
వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో 2012 జూన్ 28న డ్రమ్‌లో దొరికిన డెడ్‌బాడీ.
