దమ్‌ మారో దమ్‌! సిగరెట్‌ కంటే హుక్కా ప్రమాదకరం.. | Sakshi
Sakshi News home page

దమ్‌ మారో దమ్‌! సిగరెట్‌ కంటే హుక్కా ప్రమాదకరం..

Published Thu, May 25 2023 7:44 AM

ఇటీవల హుక్కాసెంటర్‌లో పట్టుబడిన యువకులు (ఫైల్‌) - Sakshi

ఈ నెల 2న... గోల్కొండలోని ది పాన్‌ హౌస్‌ అండ్‌ మోర్‌

ఈ నెల 13న... టోలిచౌకిలోని ది సీషా ఫ్యాక్టరీ కేఫ్‌

ఈ నెల 17న... మాసబ్‌ట్యాంక్‌లోని రెస్టో లాంజ్‌ కేఫ్‌

తాజాగా మంగళవారం... హబీబ్‌నగర్‌లోని దుబాయ్‌ సీషా లాంజ్‌...

హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాల దాడుల్లో వెలుగులోకి వచ్చిన హుక్కా పార్లర్లు/కేఫ్‌లు ఇవి. నిషేధం ఉన్నా నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న హుక్కా సెంటర్లు బార్లు, పబ్బులను మించిపోతున్నాయి. వినోదం, హెర్బల్‌ ఉత్పత్తుల ముసుగులో అనుమతులు తీసుకుంటున్న ఈ సెంటర్లు మాయమాటలతో యువతకు వల వేస్తూ వారి జీవితాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇక్కడ వివిధ ఫ్లేవర్ల పేరుతో పొగాకు, రసాయనాలతో పాటు గంజాయి కూడా వినియోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే... వీటి నిర్వాహకులు మైనర్లను కూడా అనుమతిస్తుండటం.

అక్రమంగా పదుల సంఖ్యలో...
రాజధానిలో అనేక హుక్కా సెంటర్లు అక్రమంగా నడుస్తున్నట్ల అనుమానాలున్నాయి. రిక్రియేషన్‌ సెంటర్లు, స్నూకర్‌ పార్లర్లు, హెర్బల్‌ ఉత్పత్తుల పేరుతో అనుమతులు, ఉత్తర్వులు తీసుకుంటున్న ఈ కేంద్రాలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. కేవలం యాపిల్‌, మింట్‌, పాన్‌ మసాలా, చాకో, బెర్రీస్‌ ఇలాంటి రకాలైన ఫ్లేవర్లను మాత్రమే హుక్కాల్లో వినియోగిస్తామంటున్న వీటి నిర్వాహకులు కస్టమర్లను బట్టి ‘మెనూ’ మారుస్తున్నారు. వివిధ రకాలైన పొగాకు ఉత్పత్తులను వాడేస్తున్నారు. ఇవి ఎవరి కంటా పడకుండా పార్లర్లలోని రహస్య ప్రాంతాల్లో దాస్తున్నారు. నిబంధనలను సైతం తుంగలో తొక్కి మైనర్లు, యువతులను అనుమతిస్తూ వారినీ బానిసలుగా మారుస్తున్నారు. ఈ హుక్కా కిక్కుకు అలవాటు పడిన యువత రెగ్యులర్‌ కస్టమర్లుగా మారిపోతున్నారు. మరికొన్ని సెంటర్లలో ‘అదనపు సౌకర్యాలు’ కల్పిస్తున్నారు.

మాయమాటలతో యువత ఆకర్షణ...
లేటెస్ట్‌ అడెక్షన్‌గా పిలిచే హుక్కాకు బానిసవుతున్న వారిలో సగానికి సగం మైనర్లే ఉంటున్నారు. మేజర్లు మద్యం తదితరాల కోసం బార్లు, పబ్బులకు వెళ్తుండటంతో ఆ అవకాశం లేని మైనర్లు హుక్కా దారి పడుతున్నారు. ఈ కారణంగానే నిషేధం ఉన్నప్పటికీ నిర్వాహకులు రహస్యంగా ఈ సెంటర్లు నడుపుతున్నారు. ఈ హుక్కా పైపుల్లో పొగాకు వాడకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నా ఫ్లేవర్ల కంటే నికోటిన్‌ కూడిన వాటికే డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులు వీటినే వాడుతున్నారు. హుక్కా ద్వారా వచ్చే పొగ నీటిలో నుంచి శుద్ధి అవుతూ పైపు ద్వారా నోటిలోకి వస్తుందని, దీని వల్ల నికోటిన్‌ వంటివి శరీరంలోకి చేరవని, ఎలాంటి హానీ ఉండదనీ మాయమాటలు చెబుతూ సెంటర్ల నిర్వాహకులు యువతను ఆకర్షిస్తున్నారు. ఈ మాటల వల్లో పడిన మైనర్లు ఆయా సెంటర్ల మెట్లు ఎక్కుతున్నారు. ఇవన్నీ వాస్తవదూరాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సిగరెట్‌ కంటే హుక్కా ప్రమాదకరం..
సిగరెట్‌ కన్నా హుక్కా ప్రమాదకరమైందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని పీల్చడం ద్వారా పొగ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుందని వివరిస్తున్నారు. నికోటిన్‌ కన్నా అధికమొత్తంలో కార్బన్‌మోనాకై ్సడ్‌ శరీరంలోకి చేరుతుందని, ఈ కారణంగానే హుక్కా అనేది సిగరెట్‌ కన్నా ఎన్నో రెట్లు హానికరమని చెబుతున్నారు. ఒకే హుక్కా గొట్టాన్ని అనేక మంది వాడటం, పూర్తిస్థాయిలో శుభ్రం చేయకపోవడం వల్ల ఇన్‌ఫెక్షన్స్‌తో పాటు నోటి సంబంధ వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా నిఘా ముమ్మరం చేశామని, అక్రమ దందాలపై చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement
Advertisement