హన్మకొండ కల్చరల్ : భద్రకాళి ఆలయంలో ఈ నెల 11నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాల ముందస్తు భద్రతా ఏర్పాట్లను మంగళవారం వరంగల్ సీపీ శ్వేత పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా, శాంతిభద్రతల కోసం పోలీస్‌శాఖ చేపడుతున్న చర్యలను సీపీ అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, మట్టెవాడ, ఇంతేజార్‌గంజ్, మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్లు, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొన్నారు.
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే ఆస్పత్రికి నగరంలోని శరత్ కంటి ఆస్పత్రిని రెఫరల్‌గా మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేసినట్లు రైల్వే ఆస్పత్రి సీనియర్ ఏసీఎంఎస్ డాక్టర్ ఐ.నిరంజన్‌రావు మంగళవారం తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే ఉన్నతాధాధికారులు శరత్ ఐ హాస్పిటల్‌ను రైల్వేకు రెఫరల్‌గా మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. రైల్వే కార్మికులు, వారి కుటుంబాలు, రిటైర్డ్ కార్మికులు ఇక నుంచి కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సను శరత్ ఐ ఆస్పత్రిలో చేయించుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
హసన్‌పర్తి : హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను కమిషనర్ శ్వేత మంగళవారం అభినందించారు. పోలీస్ కమిషనరేట్‌కు చెందిన 12 మంది క్రీడాకారులు వివిధ క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన ఏఆర్ అడిషనల్ డీసీపీ వి.శ్రీనివాస్, ఏసీపీ మధుసూదన్, ఏఆ ర్ ఏసీపీలు పి.అనంతయ్య, నాగయ్య, ఏసీపీ నర్సయ్య, ఎస్సైలు సురేష్, స్వర్ణలత, హెడ్‌కానిస్టేబుళ్లు ఓదెలు, శ్రీరాములు, కానిస్టేబుల్ వేణుచారి, తులసీదాస్‌లు సీపీని కలిశారు.
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్‌లో సికింద్రాబాద్ రైల్వే సేఫ్టీ అధికారులు పీసీఎస్‌ఓ బిజయ్‌కుమార్, ఏడీఆర్‌ఎం సంజీవరావు, చీఫ్ ట్రాక్ ప్లానింగ్ మేనేజర్ బల్విందర్ యాదవ్, డీఓఎం సుధీర్‌కుమార్‌తో పాటు పలు విభాగాల అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. రైల్వే లోకోపైలెట్ల కార్యాలయం రన్నింగ్ రూంకు వెళ్లి అక్కడ తనిఖీలు చేపట్టి, లోకోపైలెట్లతో జరిగిన ముఖాముఖి సమావేశంలో పలు విషయాలపై మాట్లాడారు. కాజీపేట రైల్వేస్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, ఏరియా ఆఫీసర్ ఫనికుమార్, ఎస్‌ఎస్‌ఈ రాజన్న, అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: పంటకోత ప్రయోగాలను నిర్దేశిత శాసీ్త్రయ పద్ధతిలో నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా ప్రణాళిక, వ్యవసాయ శాఖల క్షేత్రస్థాయి అధికారులకు పంటకోత ప్రయోగాల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటకోత ప్రయోగాల ద్వారా సేకరించే దిగుబడి వివరాలు ప్రభుత్వం తీసుకునే కీలక విధానపరమైన నిర్ణయాలకు ఆధారంగా ఉంటాయని అన్నారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బి.సత్యనారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వి.విజయ్‌చంద్ర, అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
హన్మకొండ చౌరస్తా: గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన, సత్వర వైద్య సేవలను అందించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. మంగళవారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని ఆమె తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలతో కలెక్టర్ మాట్లాడి అందుతున్న వైద్య సేవలపైన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.


