ఖిలా వరంగల్ : తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా సద్దుల బతుకమ్మ, విజయదశమి (దసరా) ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ సూచించారు. మంగళవారం ఉర్సు గుట్ట రంగలీల మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన ఉత్సవాల ఏర్పాట్లపై సీపీ శ్వేత, బల్దియా కమిషనర్ టి.వెంకన్న ఉత్సవ కమిటీ అధ్యక్ష,క ార్యదర్శులు నాగపూరి సంజయ్‌బాబు, మెడిది మధుసూదన్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఉత్సవాలకు బతుకమ్మ మైదానాలు, ఉర్సు రంగలీల మైదానాన్ని చదును చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, నిరంతర విద్యుత్, వైద్యసేవలు, తాత్కాలిక మరుగుదొడ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దసరా సందర్భంగా రంగలీల మైదానంలో నిర్వహించే వేడుకలకు సుమారు 3 లక్షల మంది రానున్నారని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సౌండ్ నియంత్రణ నిబంధనలు పాటిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. సీపీ శ్వేత మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లలో ట్రాఫిక్ జామ్ నియంత్రణకు పోలీసు యంత్రాంగం ఉత్సవ కమిటీకి సహరిస్తుందన్నారు. అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, వైవీ గణేష్, డీసీపీ కవిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మీ, ఆర్డీఓ సుమ, డీసీపీ సలీమా, తహసీల్దార్ ఇక్బాల్, కోశాధికారి మండ వెంకన్న, ఉపాధ్యక్షులు గోనె రాంప్రసాద్, గౌరవ అధ్యక్షుడు గోపాల నవీన్‌రాజు, వడ్నాల నరేందర్, వంగరి కోటేశ్వర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘కుడా’ చైర్‌పర్సన్, అధికారులు గైర్హాజరు
కాగాదసరా ఉత్సవాల సమీక్ష సమావేశానికి కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణితో పాటు కుడా అధికారులు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారు ఎందుకు హాజరు కాలేదన్న దానిపై అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడి కాలేదు. రాజకీయ విభేదాలతోనే హాజరు కాలేదన్న చర్చ స్థానికంగా వినిపిస్తోంది.
మాజీ మంత్రి కొండా సురేఖ
ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష


