సాక్షి ప్రతినిధి, వరంగల్ : పోలీస్ శాఖలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఎస్పీల పదోన్నతుల వ్యవహారంలో తాజాగా కదలిక మొదలైంది. 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన పలువురు డీఎస్పీలు అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందాల్సి ఉండగా.. సీనియారిటీ వివాదాలు, కోర్టు కేసులు, జోనల్ అంశాలు, ఇతర పరిపాలన కారణాలతో ప్రక్రియ సుదీర్ఘకాలంగా నిలిచిపోయింది. తాజాగా ఈ సమస్యకు సమగ్ర పరిష్కారం చూపేందుకు డీజీపీ సీవీ ఆనంద్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల 1991, 1995, 1996 బ్యాచ్‌ల వరంగల్, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ రేంజ్‌లకు చెందిన అధికారులతో సమావేశమైన ఆయన.. కేసుల ఉప సంహరణ తర్వాత పదోన్నతుల ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు పేర్కొనడంపై ఆ జాబితాలో ఉన్నవారిలో ఆశలు చిగురిస్తున్నాయి.
ఉద్యోగ విరమణకు ముందే ప్రమోషన్?
1991, 1995, 1996 బ్యాచ్‌ల అధికారులు ప్రస్తు తం డీఎస్పీలుగా పనిచేస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే అదనపు ఎస్పీ స్థాయి పదోన్నతి కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు 1998 బ్యాచ్‌కు చెందిన కొంతమంది అధికారుల విషయంలోనూ పదోన్నతుల అంశం కొనసాగుతోంది. దీంతో ఒకేసారి సీనియారిటీ, అర్హత, ఖాళీలు, కోర్టు ఆదేశాలు వంటి అనేక అంశాలను పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదోన్నతుల జాబితాలో పలువురు ఉన్నప్పటికీ ప్రస్తుతం అదనపు ఎస్పీ స్థాయిలో 37 పోస్టులు కోర్టు వ్యవహారాల కారణంగా ఖాళీగా ఉన్నాయని డీజీపీ సీవీ ఆనంద్ ఆ భేటీలో స్పష్టం చేశారు. పరస్పర విభేదాలు తమ కెరీర్‌పై ప్రభావం చూపకుండా చూడాలని సూచించారు. కోర్టుల్లో కొనసాగుతున్న కేసులను ఉపసంహరించుకుని, సీనియారిటీ–నిబంధనల ప్రకారం దశలవారీగా పదోన్నతులు కల్పించే మార్గానికి సహకరించాలని కోరారు. కేసుల ఉపసంహరణపై అధికారులు రెండు, మూడు రోజుల్లో తమ అభిప్రాయాలు తెలియజేస్తే ప్రక్రియ ముందుకు సాగనుంది.
మల్టీజోన్ – 1లో పలువురికి చాన్స్..
కోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారం సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో సమస్యను సమగ్రంగా పరిశీలించేందుకు ఇప్పటికి కమిటీని ఏర్పాటు చేశారు. సీనియారిటీ, సర్వీస్ రూల్స్, జోనల్ అంశాలు, ఖాళీలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని కసరత్తు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 1991,1995, 1996 బ్యాచ్‌లకు చెందిన పలువురు డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు దక్కనున్నాయి. మొదట 1991 బ్యాచ్‌లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో నలుగురు డీఎస్పీ/ఏసీపీలు, ఇక్కడే లూప్‌లైన్‌లోని ఓ డీఎస్పీ ఈ జాబితాలో ఉండగా.. ఒకరికి కేసుల వివాదం ప్రమోషన్‌కు ప్రతిబంధకం కానుందన్న చర్చ పోలీసుశాఖలో సాగుతోంది.
దశలవారీగా ప్రమోషన్ల ప్రతిపాదన.. అడిషనల్ ఎస్పీలుగా ప్రమోషన్లు
1991, 1995, 1996
బ్యాచ్‌ల వారీగా జాబితా
సీనియారిటీ, జోనల్ వివాదాలతో
ఏళ్లుగా పెండింగ్
డీజీపీ భేటీ తర్వాత చిగురిస్తున్న ఆశలు
మల్టీజోన్‌లో పలువురికి చాన్స్


