వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం సూరవీడు గ్రామంలో విషాదం అలుముకుంది. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామ చెరువులో శిరీష చారిటబుల్ ట్రస్ట్‌లో ఉంటూ చదువుకుంటున్న ఆరుగురు విద్యార్థులు బుధవారం గణపతి నిమజ్జనం కోసం వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో సూరవీడుకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి సుమంత్ రెడ్డి(17) కూడా ఉన్నాడు. గ్రామానికి చెందిన బేరి ముత్యం రెడ్డి, లక్ష్మి దంపతులకు ముగ్గురు కూమారులు భాస్కర్ రెడ్డి, సుమంత్ రెడ్డి, హేమ సంజయ్ రెడ్డి ఉన్నారు. కాగా, సుమంత్‌రెడ్డి మృతదేహాన్ని కుటుంబీకులు హైదరాబాద్ నుంచి సూరవీడు తీసుకొచ్చి గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. చేతికి అందొచ్చిన కుమారుడికి తల్లిదండ్రులు అంత్యక్రియలు చేయడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది.


