కేయూ క్యాంపస్ : విద్యార్థులు పరీక్షల్లో వివిధ ప్రశ్నలకు జవాబులు చీటీలు చూసి రాసినా, లేదా పక్క విద్యార్థులు రాసిన ప్రతాలు చూసి రాసి పట్టుబడితే లేదా స్క్వాడ్ బృందాలు తనిఖీకి వచ్చినప్పుడు తాను కూర్చున ప్రాంతంలో నకలు చీటీ లభించినా మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేస్తుంటారు. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసి పట్టుబడినా డీబార్ చేయడమేగాకుండా పోలీసు కేసులు కూడా నమోదు చేస్తారు. ఇదిలా ఉండగా తెలిసోతెలియకోచేసే పొరపాట్లు కూడా మాల్‌ప్రాక్టీస్ కిందకే వస్తాయి. వద్దన్న చోట హాల్‌టికెట్ నంబర్ వేసినా ఆన్సర్‌షీట్ జవాబుపత్రాలు చించినా, వాల్యుయేటర్ గుర్తించేలా ఆన్సర్‌షీట్‌లలో తన గుర్తింపును వెల్లడించడం లాంటి పనులు కూడా మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తుందనే విషయం ఎక్కువ శాతం మంది విద్యార్థులు తెలియదు. కాగా, కేయూలోని డిగ్రీ, పీజీ నాన్‌ప్రొఫెషనల్, వివిధ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలకు సంబంధించి మాల్‌ప్రాక్టీస్ నిబంధనలు కఠినతరంగా ఉన్నాయి. దీనిపై విద్యార్థులకు అవగాహన ఉండాలి. ఫలితంగా పరీక్షల విషయంలో తస్మాత్ జాగ్త్రత్త అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే కొన్ని నెలల క్రితం డిగ్రీ వివిధ సెమిస్టర్ల పరీక్షల్లో కొందరు విద్యార్థులు తమ సబ్జెక్టుల పరీక్షల ఆన్సర్‌షీట్‌లలో తమకు వచ్చిన జవాబులు రాసినా ఒక్కోవిద్యార్థి ఒక్కో పేపర్‌ను చించివేశారు. వీరి ఫలితాలను పరీక్షల విభాగం అధికారులు మాల్‌ప్రాక్టీస్ కిందనే పరిగణించి నిలిపివేశారు. దీంతో ఇటీవల ఆయా విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసొచ్చి పరీక్షల విభాగం అధికారులను అడుగుతున్నారు. మాల్ ప్రాక్టీస్ కింద లెక్క గట్టి సెమిస్టర్‌లోని మిగతా సబ్జెక్టుల ఫలితాలు కూడా నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు.
డిగ్రీ 5,6 సెమిస్టర్లలో 21మంది, 1,2,3,4 సెమిస్టర్లలో 105 మంది విద్యార్థుల ఫలితాలు నిలిపివేత
కేయూ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల్లో కొన్ని నెలల క్రితం 5,6 సెమిస్టర్ల పరీక్షలు జరగగా అధికారులు ఫలితాలు విడుదల చేశారు. 21మంది విద్యార్థులు తమ సబ్జెక్టుల ఆన్సర్‌షీట్‌లలో జవాబులు రాసినా ఒక్కో విద్యార్థి ఒక సబ్జెక్టులోని ఆన్సర్‌షీట్‌లో ఒక పేపర్‌ను చించి వేశారు. వారి ఫలితాలను మాల్‌ప్రాక్టీస్ కిందనే పరిగణించి పరీక్షల విభాగం అధికారులు నిలిపివేశారు. వారంతా డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు కావడం గమనార్హం. అలాగే, 1,2,3,4 సెమిస్టర్ల పరీక్షల్లోనూ వివిధ సబ్జెక్టుల పరీక్షల్లో ఆన్సర్‌షీట్‌లలో 105మంది విద్యార్థులు తాము రాసే సబ్జెక్టులలో ఒక సబ్జెక్టులో మాత్రం ఒక్కో పేపర్ చించివేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ 105మంది విద్యార్థుల జవాబుపత్రాలను మూల్యాంకనం చేయలేదు. మాల్‌ప్రాక్టీస్ కిందే పరిగణించి వారి ఫలితాలను నిలిపివేశారు. కాగా, సెమిస్టర్లకు సంబంధించిన సబ్జెక్టులన్నీ మాల్‌ప్రాక్టీస్ కింద పరిగణిస్తే ఆయా విద్యార్థులకు నష్టం కలగనుందని భావించి డిగ్రీ 1,2,3,4 సెమిస్టర్ల ఏ ఏ సబ్జెక్టులో ఆన్సర్‌షీట్‌లో పేపర్‌ను చించివేశారో ఆయా సబ్జెక్టులోనే ఫలితాలు నిలిపి మిగతా సబ్జెక్టుల ఫలితాలను వెల్లడించడానికి అఽధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
మాల్‌ప్రాక్టీస్ నిబంధనలు కఠినతరం
ఆన్సర్‌షీట్‌లో పేపర్ చించినా
మాల్‌ప్రాక్టీస్‌గానే పరిగణన
డిగ్రీ 5,6 సెమిస్టర్లలో పేపర్ చించిన
21 మంది స్టూడెంట్స్
ఆ సెమిస్టర్లలో అన్ని సబ్జెక్టుల
ఫలితాల నిలిపివేత
1,2,3,4 సెమిస్టర్లలో 105 మంది..
ఆందోళనలో విద్యార్థులు
ఆన్‌లైన్ మూల్యాంకనంతోనే గుర్తింపు..
ఈఏడాది నుంచే డిగ్రీ కోర్సుల పరీక్షల జవాబుపత్రాల ఆన్‌లైన్ మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. జవాబుపత్రాల బుక్‌లెట్‌లను ఒకసంస్థ పరీక్షల విభాగంలోనే స్కాన్‌చేసి ఆన్‌లైన్‌లో అధ్యాపకులకు పంపారు. ఆన్సర్‌షీట్ 28 పేజీల బుక్‌లెట్‌గా ఉంటుంది. ప్రతీ పేపర్‌కు పేజీ నంబర్ బార్‌కోడ్ కూడా ఉంటుంది. అన్ని పేజీలు ఉంటేనే కంప్యూటర్ స్కాన్ చేస్తుంది. 126మంది విద్యార్థుల ఆన్సర్‌షీట్‌లో ఒక్కో పేపర్ తక్కువగా ఉండడంతో కంప్యూటర్‌లో స్కాన్ కాకపోవడంతో ఆయా బుక్‌లెట్‌ను తెరిచి చూసి పేపర్ చించివేసినట్లు గుర్తించారు.


