వరంగల్ అర్బన్: వరంగల్ పాత బస్‌స్టేషన్‌ను కూల్చివేసి రూ.73.50 కోట్ల అంచనా వ్యయంతో నూతన బస్‌స్టేషన్ పనులను 2023 జూన్‌లో ప్రారంభించారు. రెండున్నర ఎకరాల్లో విశాలమైన బస్‌స్టేషన్ ప్రాంగణం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా నిర్మించిన బస్ స్టాండ్‌లో మౌలిక వసతులు లేక ప్రయాణికులు అవస్థల పాలవుతున్నారు. బస్‌స్టేషన్ నుంచి బయటకు వెళ్లే మరో రోడ్డు గుంతలమయంగా మారింది. కంకర తేలి, గుంతలు పడి, ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ రోడ్డు మీదుగా వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి బస్సులు బయటకు వెళ్తాయి. ఇందులో ఒకటి స్మార్ట్‌సిటీ రోడ్డు, మరొకటి బల్దియా నిర్మించిన రోడ్డు. మరి ఇంజనీరింగ్ అధికారులకు ఏమైందో ఏమో కానీ ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రమాదకర మలుపులు, ఎగుడు దిగుడు రోడ్డు, గుంతలు.. ప్రయాణికులు, డ్రైవర్ల, వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికై నా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతులు చేయాలని నగర ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
రాళ్లు ఎగిరిపడుతున్నాయి..
కూరగాయల మార్కెట్ వెలుపల–చాంబర్ ఆఫ్ కామర్స్ రోడ్డు గుంతలు పడింది. వాహనాలు వెళ్తున్నప్పుడు గుంతల్లోని రాళ్లు ఎగిరిపడుతున్నాయి. ఇంత అధ్వానంగా రోడ్డు ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవం లేదు. ఇప్పటికై నా గుంతలు పూడ్చాలి.
– జగదీశ్వర్, ఆటోడ్రైవర్
వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలో వాహనదారులకు తప్పని ఇబ్బందులు
రోడ్డు మరమ్మతులను పట్టించుకోని
జీడబ్ల్యూఎంసీ ఇంజనీర్లు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి బస్సులు వెళ్లే రోడ్డు. మొత్తం మురుగునీటితో నిండిపోయింది. బస్‌స్టేషన్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏర్పాట్లతో ఇరుకుగా మారింది. ఆపై వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.


