అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
న్యూశాయంపేట: పేద విద్యార్థులకు గిరిజన గురుకులాలు వరంగా మారనున్నాయి. వారికి కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య, వసతి, పౌష్టికాహారం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలు ఇప్పుడు విజ్ఞాన గనులుగా విరాజిల్లుతున్నాయి. ప్రతిభ ఉండి పేదరికంతో ఇబ్బంది పడుతున్న గిరిజన, గిరిజనేతర విద్యార్థుల కోసం ఈ విద్యాసంస్థలు మరోసారి ద్వారాలు తెరుచుకున్నాయి. 2026–27 విద్యాసంవత్సరానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఐదు గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకుంది.
నేరుగా ప్రవేశానికి అవకాశం..
గిరిజన గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పదో తరగతి పూర్తి చేసిన గిరిజన (ఎస్టీ) విద్యార్థులతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన గిరిజనేతర కోటా ప్రకారం ఎస్సీ, బీసీ, ఇతర వర్గాల విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్ష రాయక పోయినా లేదా మెరిట్ జాబితాలో వెనుకబడిన వారికి ఇదొక అద్భుత అవకాశం అని చెప్పవచ్చు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పించింది. ఉచిత భోజన, వసతి, యూని ఫాం, పుస్తకాలతోపాటు నాణ్యమైన బోధన, పోటీ పరీక్షలకు (జేఈఈ, నీట్) ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తుంది. గిరిజన, గిరిజనేతర విద్యార్థులు నేరుగా అడ్మిషన్ పొందడానికి వీలుంది.
బాలురకు ఒకటి, బాలికలకు
నాలుగు కళాశాలలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు బాలికల గురుకుల కళాశాలలు, ఒకటి బాలుర గురుకుల కళాశాలలు ఉన్నాయి. హనుమకొండ జిల్లా పరిధిలోని దేవన్నపేట గిరిజన సంక్షేమ గురుకుల (బాలికల) కళాశాల, జనగామ జిల్లా పరిధిలో పాలకుర్తి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాల, వరంగల్ జిల్లా పరిధిలోని పర్వతగిరి గిరిజన సంక్షేమ బాలికల కళాశాల, నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో గిరిజన సంక్షేమ బాలికల కళాశాల, వరంగల్ జిల్లా నర్సంపేటలో గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో సీట్ల భర్తీ..
ప్రతీ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గూపుల్లో 40 సీట్ల చొప్పున భర్తీ చేస్తారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలకు(34), ఓసీ/ఈబీసీ (1), బీసీ (1), ఎస్సీ (1), అనాథ (1), స్పోర్ట్స్ కోటా (1), పీహెచ్‌సీ (1)కి కేటాయింపులు ఉంటాయి. అర్హులైన విద్యార్ధులు తమ టీసీ, మెమో, స్టడీ సర్టిఫికెట్, పాస్‌ఫొటో, ఆదాయ, ఆధార్, కుల, ఆదాయ (రూరల్ పరిధి 1.50 లక్షలు, పట్టణ పరిధి రూ.2 లక్షలు) ధ్రువీకరణ పత్రాలతోపాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను వెంట తీసుకుని నేరుగా వరంగల్ యాకత్‌పురలోని చింతల్‌బ్రిడ్జి వద్ద ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలను ఈనెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు సంప్రదించాలి.
విద్యార్థులకు నాణ్యమైన బోధన, నీట్, జేఈఈలో శిక్షణ
ఉమ్మడి జిల్లాలోని ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు షురూ
దరఖాస్తుకు ఈనెల 16వ తేదీ వరకు గడువు
గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు ఉన్నత శిఖిరాలు అధిరోహించడానికి మంచి అవకాశం. అర్హులైన వారు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆలస్యం చేయకుండా తమ సమీపంలోని గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. అవకాశం కోల్పోకుండా తమ భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి.
– డీఎస్ వెంకన్న, ఆర్సీఓ వరంగల్, కరీంనగర్ రీజియన్


