మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

న్యూస్‌రీల్‌

40–60 కొత్త లీజులకు అవకాశం?

మైనర్‌ ఖనిజాల వేలంలో భారీ మార్పులు

హైబ్రిడ్‌ విధానానికి సర్కారు గ్రీన్‌సిగ్నల్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

ప్రభుత్వం మైనర్‌ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మైనింగ్‌ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్‌, స్టోన్‌ మెటల్‌, బ్లాక్‌ గ్రానైట్‌, రోడ్‌ మెటల్‌, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికా రులు భావిస్తున్నారు.

ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు..

ఉమ్మడి వరంగల్‌లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్‌, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్నా, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్‌, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అధిక భాగం స్టోన్‌ మెటల్‌, రోడ్‌ మెటల్‌ యూనిట్లు, గ్రానైట్‌ తవ్వకాలు, బ్రిక్‌ ఎర్త్‌, మట్టి క్వారీలు, ఇసుక రీచ్‌లు ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అధికంగా ఉండడంతో గ్రానైట్‌, స్టోన్‌ మెటల్‌ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

పట్టాదారులకు తీపి కబురు

ఇకపై మైనర్‌ ఖనిజాల వేలం మొత్తం ఆన్‌లైన్‌లోనే జరగనుంది. బిడ్డింగ్‌ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్‌ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్‌, మార్బుల్‌ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్‌ ఫీజులో 10 శాతం, గ్రానైట్‌, మార్బుల్‌కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని ప్రైవేట్‌ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు.

రాయల్టీ పెరిగే అవకాశం..

కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్‌లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్‌ మెటల్‌, స్టోన్‌ మెటల్‌, గ్రానైట్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్‌ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పూర్తిగా ఆన్‌లైన్‌లోనే వేలం ప్రక్రియ

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో

కొత్త లీజులు

గ్రానైట్‌, స్టోన్‌ మెటల్‌,

ఇసుక క్వారీలపై ఫోకస్‌

ఇప్పటి వరకు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్‌ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్‌ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్‌లో బ్లాక్‌ గ్రానైట్‌, భూపాలపల్లిలో రోడ్‌ మెటల్‌, ములుగులో స్టోన్‌ క్వారీలు, వరంగల్‌, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్‌ క్వారీలు అధికం. కాగా, ఆయా జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement