ఓరుగల్లు పీఠకాపరి బిషప్ విజయపాల్‌రెడ్డి
కాజీపేట రూరల్: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని రోమన్ క్యాథలిక్ సంఘం 40 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తోందని ఓరుగల్లు మేత్రాసనం పీఠాధిపతి బిషప్ దుగ్గుంపుడి విజయపాల్‌రెడ్డి అన్నారు. దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కుల సాధన రౌండ్ టేబుల్ సమావేశం కాజీపేట ఫాతిమానగర్‌లో సోమవారం ఫాదర్ నవీన్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఏటా ఆగస్టు 10న నిరసన దినం జరుపుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్ కాంగ్రెస్ తరఫున, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్‌ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు తెలిపారు. సీపీఐ నాయకులు రాజమౌళి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి నున్నా అప్పారావు మాట్లాడుతూ.. దేశంలో మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోలేదని, కులం ఉన్నంత కాలం ఎస్సీ హోదా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రెవ.అశోక్‌పాల్, బోడ డిన్నా, ఫాదర్ జోసెఫ్, రాజమోహన్, పొలిమెర సృజన్‌కుమార్, ప్రవీణ్, ఎన్.కిరణ్, జన్ను ఈర్మియా, అరుణ్‌జెమ్స్, కొవడవటి రవి తదితరులున్నారు.


