హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: బాలికల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యంపై అవగాహన, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. స్నేహ సమ్మర్ క్యాంపుల నిర్వహణపై డీఆర్డీఓ మేన శ్రీను, డీడబ్ల్యూఓ విశ్వజ, డీఈఓ గిరిరాజ్ గౌడ్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, డీపీఓ లక్ష్మీ రమాకాంత్ తదితర అధికారులతో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కౌమార దశలో బాలికల్లో చోటు చేసుకునే శారీరక, మానసిక మార్పులపై అవగాహన కల్పించాలని సూచించారు. గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై బాలికలకు స్పష్టమైన అవగాహన కలిగించాలన్నారు. బాలికలను క్రీడల వైపు ప్రోత్సహించాలని, ప్రతీ గ్రామపంచాయతీలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ చంద్రమోహన్, డీపీఎం పద్మప్రియ, ఏపీఎం శ్రీలత, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, అధికారులు పాల్గొన్నారు.
‘ఎస్‌ఐఆర్ ’మ్యాపింగ్ వేగవంతానికి చర్యలు
జిల్లాలో ‘ఎస్‌ఐఆర్’ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యా పింగ్ ప్రక్రియపై కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ్యాపింగ్ ప్రక్రియకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించి నియమిస్తున్నామని తెలిపారు. డీఆర్‌ఓ శ్రీనివాస్, ఆర్డీఓలు రమేశ్ రాథోడ్, నారాయణ, తహసీల్దార్లు విజయలక్ష్మి, రవీందర్‌రెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ జగత్‌సింగ్ అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
వరంగల్ అర్బన్: నగరంలోని అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ ఆదేశించారు. వరంగల్ నాయుడు పెట్రోల్ పంపు, రామన్నపేట, లక్ష్మీపురం, మట్టెవాడ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈఈ సంతోశ్‌బాబు, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, అధికారులు పాల్గొన్నారు.


