నేటి నుంచి కళాశాలల్లో ప్రవేశాలు
విద్యారణ్యపురి: అన్ని యాజమాన్యాల పరిధి జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం ఇంటర్ బోర్డ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, వివిధ గురుకులాల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం తొలుత యోచించి ప్రవేశాలకు జారీచేసిన షెడ్యూల్‌ను నిలిపివేసిన విషయం విధితమే. అయితే ఆ నిర్ణయాన్ని (విలీన ప్రక్రియను) ప్రభుత్వం మార్చుకొని ఈఏడాది యథావిఽధిగానే ఇంటర్ అడ్మిషన్లకు పచ్చజెండా ఊపింది. ఇంటర్ బోర్డు తాజాగా అడ్మిషన్లకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకుల జూనియర్ కళాశాలల్లోనూ ప్రవేశాలు కల్పించన్నారు.
జూన్ 1 నుంచి తరగతులు..
మొదటి దశ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 12 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూనియర్ కళాశాలల్లో ఈనెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 1 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 30 వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. టెన్త్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఆ తర్వాత ఒరిజినల్ టెన్త్ మెమోలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.


