కేయూ క్యాంపస్ : అమెరికాలోని ఎరోడెక్స్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కళాశాల అధ్యాపకుడు, జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ రుక్కిరెడ్డి ఆదిరెడ్డి పాల్గొననున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఆదివారం తెలిపారు. ఈ సదస్సులో మీడియా అధ్యయనాలు, డిజిటల్ కమ్యూనికేషన్ సమకాలిన జర్నలిజం ధోరణలపై ఆదిరెడ్డి తన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారని ఆమె వెల్లడించారు. ఈమేరకు అంతర్జాతీయ సదస్సుకు రావాలని ఆదిరెడ్డికి ఆహ్వానం అందిందన్నారు. ప్రిన్సిపాల్‌తోపాటు పలువురు అధ్యాపకులు ఆదిరెడ్డిని అభినందించారు.
విద్యారణ్యపురి : వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీజీఈటీ పరీక్షకు ఉచిత శిక్షణను హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఈ ఉచిత కోచింగ్‌ను ఈనెల 12 నుంచి ప్రారంభించినున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో 40 రోజుల ఉచిత శిక్షణను నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్రీ విభాగం అధిపతి ప్రొఫెసర్ వాసం శ్రీనివాస్ తెలిపారు. ఈ సారి కెమిస్ట్రీ సబ్జెక్టుతోపాటు ఇంగ్లిష్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, బాటనీ, కామర్స్, మైక్రోబయాలజీ సబ్జెక్టులో కూడా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకోసం విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమ తమ సబ్జెక్టు విభాగాల అధిపతులను ఇతర వివరాలకు పీజీ కోఆర్డినేటర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కోరారు.
నయీంనగర్ : చారిత్రాత్మక హనుమకొండ కలెక్టర్ బంగ్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆదివారం ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పరిశీలించారు. కుడా హార్టికల్చర్ అధికారి ఆసిఫ్‌అలీ పాల్గొన్నారు.
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ గ్రీవెన్ సెల్‌ను నేడు (సోమవారం) నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. గ్రీవెన్స్ సెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హన్మకొండ అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం సూచించారు. జిల్లాలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ‘కుడా’ కార్యాలయం సమీపంలోని హనుమకొండ ఆర్డీఓ కార్యాలయం, పరకాల ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిలో వినిపించి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
జిల్లా, డివిజన్ స్థాయిలో..
న్యూశాయంపేట : ప్రభుత్వం ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ డివిజన్ స్థాయి ప్రజావాణిని సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ సోమవారం జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ప్రజావాణితో పాటు రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఆయా ప్రజావాణిలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.


