న్యూశాయంపేట : జిల్లావ్యాప్తంగా జనగణన–2027కు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి, తదితర అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రణాళిక, గణాంక శాఖ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు సన్నద్ధమవుతున్నారు. జనాభా లెక్కలు రెండు విడతల్లో 33 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ (ఆదివారం) వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ జనగణన) ప్రక్రియ ముగిసింది. మలివిడతలో సోమవారం(నేటి) నుంచి జూన్ 9వ తేదీ వరకు ఎన్యుమరేటర్స్ బ్లాక్‌ల వారీగా ఇళ్ల సంఖ్యను లెక్కించనున్నారు. అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టే రెండో దశలో జనాభా పూర్తి వివరాలను నమోదు చేస్తారు.
వివరాల సేకరణ..
జనగణనలో భాగంగా వ్యక్తి పేరు, ఇంటిపేరు, కుటుంబ యజమానితో బంధుత్వం, వయస్సు, లింగం, చదువు, టీవీ, బైక్, కారు వంటి వివరాలను అధికారులు సేకరించి నమోదు చేస్తారు. ఎస్సీ, ఎస్టీల కులం వివరాలు కూడా సేకరిస్తారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 14 మండలాల్లో (12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు) 1,237 హౌజ్ లిస్టింగ్ బ్లాక్స్ (హెచ్‌ఎల్‌బీస్) గుర్తించారు. ఇందుకు 933 మంది ఎన్యుమరేటర్స్‌ను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వీరితో పాటు 161 మంది సూపర్ వైజర్లను ఎంపిక చేసి ఇందులో భాగస్వాములు చేయనున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 1,094 మంది సిబ్బంది పాల్గొననున్నారు.


