కాశిబుగ్గ: సంతానం లేని పేదలకు అవసరమైన ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలు (ఫెర్టిలిటీ సెంటర్లు) అందుబాటులో ఉండడం లేదు. ఆర్థికంగా ఉన్న దంపతులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ పిల్లలకు జన్మనిస్తారు. ఇటీవల కాలంలో సంతాన సాఫల్య కేంద్రాలు కార్పొరేట్ ఆస్పత్రుల మాదిరిగా పుట్టుకొస్తున్నాయి. పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన ఈ సెంటర్లు పట్టణాలు, జిల్లా కేంద్రాలకు విస్తరించాయి. సంబంధిత వైద్యులు సంతానం పేరుతో నెలల తరబడి వైద్యం అందిస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఐయూఐ, ఐవీఎఫ్ ద్వారా మహిళలకు గర్భం వచ్చేటట్లు చేస్తారు. దీనికోసం ఆర్థికంగా ఉన్న దంపతులు లక్షలాది రూపాయలు ఖర్చు చేయడానికి ముందుకు వస్తారు. ప్రస్తుతం హనుమకొండలో సుమారు 15, వరంగల్‌లో రెండు ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నట్లు సమాచారం.
సీకేఎంలో పరీక్షలు.. తర్వాత గాంధీకి రెఫర్
వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్ లేదు. వైద్యులు మెడికల్ మేనేజ్‌మెంట్ సేవలు అందిస్తున్నారు. ఈ సంతాన సాఫల్య కేంద్రాన్ని గతేడాది మార్చి 15న ప్రారంభించారు. ముందుగా సంతానం సమస్యతో వచ్చినవారికి కౌన్సెలింగ్ ఇస్తారు. ఆ తర్వాత భర్త, భార్యకు అవసరమైన పరీక్షలు చేయిస్తారు. రిపోర్టుల ఆధారంగా వారికి సలహాలు ఇస్తారు. తర్వాత సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేస్తారు. కాగా, సీకేఎంలో వీరికి ప్రతిరోజు ఓపీ ద్వారా సేవలు అందిస్తారు. దంపతులకు మూడు నెలల పాటు సేవలు అందిస్తామని వైద్యులు చెబుతున్నారు.
రూ.25 లక్షల నిధులు వృథా..
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి తర్వాత గత సంవత్సరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఫెర్టిలిటీ సెంటర్ మంజూరు చేశారు. దీంతో సంతాన లేమితో బాధపడేవారికి ఎంజీఎంలో ఫెర్టిలిటీ సేవలు అందిస్తారని ఆశిస్తే నిరాశే మిగిలింది. తొలుత ఓ భవనంలో ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని భావించారు. పనులు సగం పూర్తయిన తర్వాత ఎంజీఎంను 24 అంతస్తుల సముదాయానికి మార్చే అవకాశం ఉండడంతో పనులు నిలిపివేశారు. ఈ పనుల కోసం రూ.25 లక్షల నిధులు వృథా అయినట్లు తెలుస్తోంది.
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోనూ అంతే..
అధికారుల ఆదేశాల మేరకు ఎంజీఎం నుంచి కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఫెర్టిలిటీ సెంటర్ మారినా ఫలితం లేకుండా పోయింది. ఇందులోని ఐదో అంతస్తులో దీనిని ఏర్పాటు చేయాలని థర్డ్ పార్టీ కాంట్రాక్టు ఇచ్చినట్లు చెబుతున్నారు. దీని గురించి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి సంబంధించిన అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. అధికారులు స్పందించి ఫెర్టిలిటీ సేవలు ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.
సీకేఎంలో సేవలు అందిస్తున్నాం..
సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో సంతానం లేనివారికి సంబంధిత వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తారు. ఇక్కడ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా మెడికల్ మేనేజ్‌మెంట్ సేవలు మాత్రమే అందిస్తాం. దంపతులకు అవసరమైన వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తాం. వారి సమస్యలు గుర్తించి, ఇతర ఆస్పత్రులకు రెఫర్ చే స్తాం. ప్రతీరోజు ఓపీ ద్వారా సేవలందిస్తున్నాం.
– డాక్టర్ లక్ష్మీదేవి, సీకేఎం
ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్
సంతాన సాఫల్య
కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రభుత్వం
సీకేఎంలో మెడికల్ మేనేజ్‌మెంట్ సేవలకే పరిమితం
సూపర్ స్పెషాలిటీలో
అడుగడుగునా జాప్యం


