అధికారికంగా ప్రకటించిన
వాటికన్‌సిటీ 14వ పోప్ లియో
కాజీపేట రూరల్: ఓరుగల్లు కథోళిక పీఠం నూతన బిషప్‌గా ప్రస్తుత పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్‌రెడ్డిని నియమిస్తూ వాటికన్‌సిటీలో 14వ పోప్ లియో శనివారం అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు కాజీపేట ఫాతిమానగర్‌లోని కెథిడ్రల్ చర్చిలో శనివారం విశాఖ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఉడుములబాల, ఖమ్మం పీఠకాపరి మోస్ట్ రెవరెండ్ సగినాల ప్రకాశ్.. పోప్ లియో అధికార ప్రకటన నియామకపు బిషప్ పత్రాన్ని చదివి వరంగల్ బిషప్‌గా విజయపాల్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం ఓరుగల్లు పీఠం ఫాదర్లు, చర్చి కమిటీ బాధ్యులు, ప్రజలు ఫాదర్ విజయపాల్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఫాదర్లు కొమ్మారెడ్డి జెసెఫ్, అనుకిరణ్, మర్రెడ్డి, టి.జోసెఫ్, మత్యాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
34 ఏళ్లుగా ఫాదర్ విజయపాల్‌రెడ్డి సేవలు
వరంగల్ జిల్లా గీసుకొండ మనుగొండ గ్రామంలో రాయపురెడ్డి, ఆగ్నేసమ్మ దంపతులకు 1956 జనవరి 8న విజయపాల్‌రెడ్డి జన్మించారు. చిన్ననాటి నుంచే వినయం, మృదుత్వం, సేవాభావం గుణాలను ఆయన అలవర్చుకున్నారు. జాన్స్ మేజర్ మిషనరీలో తత్వశాస్త్రం, ధర్మశాస్త్రం, విద్యను పూర్తి చేశారు. 1992 ఏప్రిల్ 2న వరంగల్ డయాసిస్‌కు యాజకునిగా అభిషేకం పొందారు. ఖమ్మం డయాసిస్‌లో అసిస్టెంట్ పారిష్ ప్రీస్ట్‌గా, ఎలూరు డయాసిస్‌లో హాస్టల్ డైరెక్టర్‌గా, వరంగల్ డయాసిస్ దేవగిరి పట్నం పారిష్ ఫ్రీస్ట్‌గా, ఫాతిమా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రినిపాల్‌గా, పాఠశాల ఉపాధ్యాయుడిగా, కాజీపేట లోడి సాంఘిక సంస్థ డైరెక్టర్‌గా, జనగామ క్రీస్తు జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ డైరెక్టర్‌గా సేవలందిస్తూ వరంగల్ డయాసిస్ అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు చేపట్టారు.


