సర్కారు భూమి కబ్జా | - | Sakshi
Sakshi News home page

సర్కారు భూమి కబ్జా

May 9 2026 8:14 AM | Updated on May 9 2026 8:14 AM

సర్కారు భూమి కబ్జా

కాశిబుగ్గ: వరంగల్‌ దేశాయిపేటలోని సర్కారు భూములపై కబ్జాదారులు కన్నేశారు. ఓ పార్టీ నాయకుడు దర్జాగా తాను నిర్మిస్తున్న వెంచర్‌కు రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు పవిత్రమైన కై లాసిగిరి ప్రదక్షిణ రోడ్డు మార్గం కూడా మాయం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశాయిపేటలోని లక్ష్మీ టౌన్‌షిప్‌ సమీపాన ఉన్న ప్రభుత్వ భూమిని అందినకాడికి కొందరు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ పార్టీకి చెందిన నాయకుడు తన ప్రైవేట్‌ స్థలంలో వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఈ వెంచర్‌కు రావడానికి వీలుగా ప్రభుత్వ స్థలంలోనే రోడ్డు నిర్మించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి వెళ్లారు. చివరకు దీనిపై కేసు నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మళ్లీ వెంచర్‌ పక్కనే ఉన్న స్థలాన్ని కూడా కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాలభైరవ గుడి పక్కనే బండరాళ్లతో కూడిన స్థలాన్ని జేసీబీలు పెట్టి దర్జాగా చదును చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ 15 ఏళ్ల క్రితం బండ్ల బాట రోడ్డు మ్యాప్‌ ఉన్నట్లు ఆధారాలు ఉన్నప్పటికీ రోడ్డు మార్గాన్ని కబ్జా చేస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ స్థలంలోనే కార్మికులకు సంబంధించిన గుడిసెలు వేసి, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, విల్లాలకు అనుకూలంగా రోడ్డు వేయడం, భూములను చదును చేయడం వెనుక ఎవరి మద్దతు ఉందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా మున్సిపల్‌, రెవెన్యూ అదికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను అడ్డుకుని సర్కార్‌ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

నిర్మాణ పనులు నిలిపేసిన అధికారులు

వరంగల్‌ దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్‌షిప్‌ సమీపంలో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాన్ని వరంగల్‌ రెవెన్యూ అధికారులు శుక్రవారం పరిశీలించారు. భూములను పరిశీలించి, వివరాలను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణస్వామి, సర్వేయర్‌ సందీప్‌ అడిగి తెలుసుకున్నారు. వెంటనే నిర్మాణ పనులను ఆపాలని ఆదేశించారు. సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని వారు పేర్కొన్నారు.

వెంచర్‌ కోసం రోడ్డు నిర్మాణ పనులు

కై లాసగిరి ప్రదక్షిణ రోడ్డు మాయం

Advertisement
 
Advertisement
Advertisement