బచ్చన్నపేట : వేసవి సెలవుల్లో విద్యార్థులు యోగాపై ఆసక్తి చూపుతున్నారు. సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా యోగా నేర్చుకుంటున్నారు. మండలంలో కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో యోగా గురువు మల్లేశం రోజు విద్యార్థులకు యోగాను నేర్పిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్ల లను యోగా తరగతులకు పంపిస్తున్నారు.
చిన్నారుల్లో భక్తిభావం..
గోవిందరావుపేట : వేసవి సెలవుల్లో సాధారణంగా చిన్నారులు సెల్‌ఫోన్లు, టీవీలతో సమయం గడుపుతుంటారు. కానీ మండలంలోని చల్వాయి గ్రామంలో చిన్నారులు హనుమాన్ మాలధరించి భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, భక్తి, సంస్కారం అలవడితే భవిష్యత్‌లో మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుందనే ఆలోచనతో ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం స్నానాలు చేసి దేవాలయాలకు వెళ్లడం, భజనలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణం, పెద్దలకు గౌరవం ఇవ్వడం వంటి అలవాట్లు చిన్నారుల్లో పెంపొందుతున్నాయి. ముఖ్యంగా సెల్‌ఫోన్లకు అలవాటు పడుతున్న ప్రస్తుత కాలంలో చిన్నారులను ఆధ్యాత్మిక వాతావరణంలో వల్ల చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. వేసవి సెలవులు వృథా కాకుండా పిల్లలకు మంచి మార్గం చూపిస్తున్నామని, చదువుతో పాటు సంస్కారం కూడా అవసరమని, చిన్నప్పటి నుంచే భక్తి భావం అలవడితే జీవితంలో క్రమశిక్షణ పెరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.


