రైతులకు చేరువలో ‘ఆకాశవాణి’ | - | Sakshi
Sakshi News home page

రైతులకు చేరువలో ‘ఆకాశవాణి’

May 9 2026 8:14 AM | Updated on May 9 2026 8:14 AM

హన్మకొండ : ఆకాశవాణి వరంగల్‌ కార్యక్రమాలు రైతులకు చేరువగా వెళ్లాయని వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ సంచాలకుడు డాక్టర్‌ ఆర్‌.ఉమా రెడ్డి కొనియాడారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం వాక్‌ థాన్‌ నిర్వహించారు. అందులో భాగంగా హనుమకొండ కేయూ క్రాస్‌లోని వరంగల్‌ ఆకాశవాణి ప్రాంగణం నుంచి కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వరకు, తిరిగి ఆకాశవాణి ప్రాంగణం వరకు వాక్‌ థాన్‌ సాగింది. డాక్టర్‌ ఆర్‌.ఉమా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి వాక్‌థాన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆకాశవాణి అనేక కార్యక్రమాలను రైతులకు చేరువ చేయడంలో ఇక్కడి శాస్త్రవేత్తలు, అధికారులు ఎంతగానో తోడ్పడుతున్నారని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో సైతం ఆకాశవాణి సేవలు అద్వితీయమన్నారు. వరంగల్‌ కేంద్రానికి దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని, స్థానికంగా ఉన్న ఎంతోమంది మేధావులు సైతం ఆకాశవాణి ద్వారా పలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారని కొనియాడారు. ఆకాశవాణి వరంగల్‌ కేంద్రం కార్యక్రమ నిర్వహణ అధికారి, ప్రోగ్రాం హెడ్‌, స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ ఇల్లందుల రవికుమార్‌ మాట్లాడుతూ.. ఆకాశవాణి వాకథాన్‌ విజయవంతమైందని అన్నారు. జూన్‌ 8వ తేదీ వరకు ఇలాంటి వినూత్న, సృజనాత్మక కార్యక్రమాలు మరెన్నో శ్రోతలకి అందించనున్నామని తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయం పీఆర్‌ఓ డాక్టర్‌ వల్లాల పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ ఆకాశవాణితో తన చిరకాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి సిబ్బంది శ్రీనివాస్‌, శివ, నరేష్‌, విజయలక్ష్మి, శ్రీనివాసరాజు, శ్రీనివాస చారి, ఉషశ్రీ, రామ్మూర్తి, రామ్మోహన్‌, అనిల్‌ ప్రసాద్‌తో పాటు వ్యాఖ్యాతలు, విశ్రాంత ఉద్యోగులు, శ్రోతలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రాంతీయ వ్యవసాయ స్థానం

సహపరిశోధన సంచాలకుడు

డాక్టర్‌ ఆర్‌.ఉమా రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement