కేయూ క్యాంపస్: విద్యార్థులకు నైపుణ్య ఆధారిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్ హాల్‌లో అధ్యాపకులకు, డీన్‌లకు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ–స్కిల్ డిజైర్‌తో అవగాహన ఒప్పందం ద్వారా ఫుల్ స్టాక్ జావా, డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నామన్నారు. స్కిల్ డిజైర్ డైరెక్టర్ ముప్పల శ్రీకాంత్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలు వివరించారు.
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీనివాస్ శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయనను కలిసిన పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ అండ్ టూరిజం విభాగం అధిపతిగా ప్రొఫెసర్ టి.మనోహర్‌ను నియమిస్తూ రిజి స్ట్రార్ వి.రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రెండేళ్లుగా రాజ్‌కుమార్ విభాగా ధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవీకాలం పూర్తవడంతో ఆ స్థానంలో మనోహర్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన ఆ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కూడా కొనసాగుతున్నారు. ఈ మేరకు వీసీ కె.ప్రతాప్‌రెడ్డి చేతులమీదుగా మనోహర్ ఉత్తర్వులు అందుకున్నారు. ఓఎస్‌డీ బి.వెంకట్రామ్‌రెడ్డి, అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ పాల్గొన్నారు.
వరంగల్ క్రైం: ఉద్యోగంలో స్థాయి పెరిగినా కొద్ది బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలందించేలా అధికారులు కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల ఏఎస్సై స్థాయి నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన 25 మంది అధికారులు శుక్రవారం పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి పొందిన ఎస్సై భుజాలపై స్టార్స్‌ను అలంకరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు.
కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో వర్చువల్‌లో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–హసన్‌పర్తి రైల్వేస్టేషన్ల మధ్య కోమటిపల్లి రైల్వే గేట్‌సమీపంలో నిర్మించిన సొరంగమార్గం (రైల్ అండర్ రైల్), బల్లార్షా – కాజీపేట – విజయవాడ మూడో రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. కాగా, కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ–కోచ్‌ఫ్యాక్టరీ) ప్రధాని ప్రారంభించే ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు లేదని రైల్వే అధికారులు తెలిపారు. పనులు పూర్తి స్థాయిలో కాలేదని పేర్కొన్నారు.


