వరంగల్ అర్బన్: జనగణన–27లో భాగంగా నిర్వహించనున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియ, స్వీయ గణనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం వరంగల్ ఎంజీఎం సెంటర్ నుంచి హనుమకొండ వేయిస్తంభాల ఆలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, అధికారులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. ములుగు రోడ్ జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి, ‘జనగణన–27లో పాల్గొని దేశాభివృద్ధికి సహకరిద్దాం’’ అంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, కార్పొరేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది, మెప్మా సభ్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు, తెలంగాణ సాంస్కతిక సారథి బృందం, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ సహకరించాలి..
హన్మకొండ అర్బన్: జనగణన–27 విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కోరారు. శుక్రవారం జనగణన–27 అవగాహన ప్రచార వాహనాన్ని హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, డీఆర్డీఓ మేన శ్రీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ
నెలవారీ తనిఖీల్లో భాగంగా.. నగరంలోని రెడ్ క్రాస్ భవనం వెనుక ఉన్న ఈవీఎం గోడౌన్‌ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు జగత్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మత్స్యకారులకు అవగాహన సదస్సు
హన్మకొండ చౌరస్తా: చెరువుల పరిశుభ్రత, నీటి నాణ్యత పరిరక్షణ, చేపల వ్యాధుల నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేస్తే మత్స్య ఉత్పత్తి పెరిగి మత్స్యకారులకు అధిక ఆదాయం లభిస్తుందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న ‘రైతు వారం’ ఐదో రోజు సందర్భంగా చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, చేపల వ్యాధుల నియంత్రణ, చేపల అధికోత్పత్తి సాధనపై హనుమకొండలోని పద్మశాలి భవన్‌న్‌లో శుక్రవారం జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆధునిక మత్స్య సాగు పద్ధతులు, చెరువుల నిర్వహణ, చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. హైదరాబాద్ వ్యవసాయ శాఖ స్పెషల్ ఆఫీసర్ నీలం పుష్పరాణి, జిల్లా మత్స్యశాఖ అధికారి పి.శ్రీపతి, మామునూరు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ గణేశ్ (ఆక్వాకల్చర్), ఎఫ్‌డీఓ (రిటైర్డ్), ఎస్.వేణుగోపాల్, డీఎఫ్‌సీఎస్ హనుమకొండ మల్లేశం, మత్స్యకారులు పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి
చాహత్ బాజ్‌పాయ్
జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో
అవగాహన ర్యాలీ


