రైతును కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే | - | Sakshi
Sakshi News home page

రైతును కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే

May 8 2026 9:50 AM | Updated on May 8 2026 9:50 AM

రైతును కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే

హన్మకొండ: రైతును కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా గురువారం ముగిసింది. చివరి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మేళాలో ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించి వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతాంగానికి కావాల్సిన అన్ని అవకాశాలు కళ్ల ముందుంచాలని, యాంత్రీకరణ, పురుగు మందులు, ఎరువులు, మార్కెటింగ్‌ వ్యవస్థ, భవిష్యత్‌లో రాష్ట్రంలో ఏ రకంగా ముందుకు పోవాలి తదితర అంశాలపై రైతులను అవగాహన కల్పించేందుకే హనుమకొండలో రైతుమేళా నిర్వహించామన్నారు. రైతుకు పాడి–పంట రెండూ అవసరమని, ఈ రెండింటి వైపు రైతును ప్రోత్సహించాలన్నారు. ఆయిల్‌పాం లాభదాయకమని, రైతులు దీని సాగుపై దృష్టి సారించాలన్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాలన్నారు. రైతుబంధు పేరుతో యాంత్రీకరణ ఆపేసి నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను అష్టకష్టాల పాలు చేసిందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, యూరియా సరఫరాపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ నాయకులకు లేదన్నారు.

రైతులు దానం చేయాలని

నాడు వైఎస్‌ చెప్పారు..

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రైతులు దానం చేయాలని, యాచించకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెప్పారని, ఈ మేరకు వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ ఉచిత విద్యుత్‌ అందించారని, ప్రాజెక్టులు నిర్మించారన్నారు. అదే బాటలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

కొనుగోళ్లు వేగంగా జరగడం లేదు..

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధాన్యం, మక్కల కొనుగోళ్లు వేగంగా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలు రాకముందే కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసిందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్‌ నాగరాజు, రైతులు గోపిరెడ్డి గోపాల్‌ రెడ్డి, లావణ్య రెడ్డి, భాగ్యలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా, హనుమకొండ, వరంగల్‌ కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయ్‌, సత్యశారద, అదనపు కలెక్టర్లు ఎన్‌.రవి, సంధ్యారాణి, ‘కుడా’ చైర్మన్‌ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, ఎన్పీడీసీఎల్‌ అధికారులు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.

ఆయిల్‌పాం సాగు

లాభదాయకం

సేంద్రియ పంటల వైపు

రైతులు దృష్టి సారించాలి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

తుమ్మల నాగేశ్వర్‌ రావు

ముగిసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా

Advertisement
 
Advertisement
Advertisement