వరంగల్ క్రైం: మూగ జీవాల అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఖానాపురం ఎస్సై జి.రామ్మోహన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు. ఈ మేరకు గురువారం సీపీ కార్యాలయంలో నగదు రివార్డు అందజేశారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: ప్రజాపాలన – ప్రగతిప్రణాళికలో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రైతు మేళాలో మూడు రోజులపాటు వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు అలాగే, అవగాహన స్టాల్‌ను కూడా నిర్వహించినట్లు హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య గురువారం తెలిపారు. 15 మందితో కూడిన వైద్యబృందంతో మూడు రోజుల పాటు రెండు షిఫ్టుల్లో వైద్య సేవలు అందించామని తెలిపారు. 229 మందికి బీపీ, 179 మందికి షుగర్, నాలుగు ఈసీజీ పరీక్షలు 375 ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒకరు ఫిట్స్, మరొకరు ఛాతి నొప్పితో బాధపడగా.. వారికి ఫస్ట్ ఎయిడ్ చేసి స్టెబిలైజ్ చేశాక మెరుగైన సేవలకు 108 ద్వారా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈవైద్యశిబిరంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రదీప్‌రెడ్డి, డీఐఓ డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ వి.అశోక్‌రెడ్డి, డాక్టర్ నవీన్ పర్యవేక్షించారు. వైద్య అధికారులు అరుణ్‌కుమార్, శ్వేత, స్వాతి, విప్లవకుమార్, పారామెడికల్ సిబ్బంది, ఆశవర్కర్లు సేవలందించారని అప్పయ్య తెలిపారు.
వీసీలో రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి,
సంచాలకులు భారతి హోళికేరి
వరంగల్ అర్బన్/న్యూశాయంపేట: జనగణన–27 కార్యక్రమంలో భాగంగా ఇళ్ల, జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 11 నుంచి జూన్ 9వరకు నిర్వహించే ప్రక్రియను సవ్యంగా నిర్వహించాలని, స్వీయ గణనపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలందరికి తెలిసే విధంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. కాగా, స్వీయ గణన కోసం నేడు(శుక్రవారం) ఎంజీఎం కూడలి నుండి వెయ్యి స్తంభాల ఆలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్, అదనపు ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి చంద్రశేఖర్, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్, టీఎంసీ రమేశ్, వరంగల్ నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నలుగురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డిని శాయంపేటకు, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ జె.శ్యామ్ సుందర్‌ను కాజీపేటకు, పీసీఆర్‌లో పనిచేస్తున్న ఏ.మహేందర్‌ను హసన్‌పర్తికి, ప్రస్తుతం హసన్‌పర్తిలో విధులు నిర్వహిస్తున్న వి.చేరాలును వీఆర్‌కు బదిలీ చేశారు.


