హన్మకొండ కల్చరల్: దేవాలయాల్లో పనిచేయడానికి గ్రేడ్ 1, 2, 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల నియామనికి 190 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడడంపై తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనుగుల రత్నాకర్, గ్రేటర్ వరంగల్ జేఏసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ శర్మ, రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రచారి, రాష్ట్ర దేవాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కొండూరు కృష్ణమాచారి తదితరులు హనుమకొండ రాంనగర్‌లో దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి దేవాదాయశాఖ ఈఓల నియామకానికి ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఉప ప్రధానార్చక, ప్రధాన అర్చక పోసుల్లో నియామకం చేపట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దేవాదాయశాఖలో పనిచేస్తున్నారని, ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం నియామకాలు చేపట్టాలని కోరారు. మంత్రి సురేఖ సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా విషయాలను చర్చించారు. అలాగే దేవాదాయశాఖలో 190 పోస్టులు కేబినెట్‌లో తీర్మానం చేసినందుకు అర్చక ఉద్యోగ జేఏసీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


