వరంగల్ అర్బన్: ఐదేళ్లలో వరంగల్ మహా నగర సమగ్రాభివృద్ధికి రూ.3,331 కోట్ల వ్యయంతో 6,676 పనులు చేపట్టి, అత్యుత్తమ, ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ఎక్స్ అఫీషియో, పాలక మండలి సభ్యులు, కమిషనర్, అధికారులు, ఉద్యోగుల సేవలు అమూల్యమైనవన్నారు. గ్రేటర్ వరంగల్ పాలక మండలి చివరి కౌన్సిల్ సమావేశాన్ని మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. 20 ఎజెండా అంశాలకు సంబంధించి రూ.76.56 కోట్ల అభివృద్ధి పనులకు సర్వసభ్య సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా పాలకవర్గం సమష్టిగా పని చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టిందన్నారు. వరంగల్ ప్రజల దశాబ్దాల కల అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్ట్‌కు పునాది వేయడం కీలక విజయమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. స్మార్ట్ సిటీ పథకం ద్వారా ఆధునిక మౌలిక వసతులు, స్మార్ట్ రోడ్లు, జంక్షన్లు, చెరువుల సుందరీకరణ వంటి పనులు నగరానికి కొత్త రూపును తెచ్చాయని చెప్పారు. తాగునీటి సమస్యను అధిగమించి ప్రతీ రోజూ నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నామని, పారిశుద్ధ్య రంగంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామని వెల్లడించారు. వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచాం. భవిష్యత్‌లో సమస్య లేకుండా ప్రణాళికలు అమలు చేస్తున్నాం.
చర్చ జరిగిందిలా..
5వేల నుంచి 6 వేల మందితో కూడిన డివిజన్‌గా పునర్విభజన చేస్తామని ఎమ్మెల్యే నాగరాజు ప్రస్తావించారు. గ్రేటర్ స్థాయి తగ్గించకుండా 12 వేల నుంచి 15 వేల మందితో ఒక డివిజన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లలో మాట్లాడేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వకపోవడం సరికాదని కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి అన్నారు. గత ఐదేళ్లలో డివిజన్ ప్రజలతో, కౌన్సిల్‌లో జరిగిన పరిణామాలపై పలువురు కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. సుదీర్ఘ కాలం నడిచిన ప్రయాణం మధుర జ్ఞాపకంగా నిలుస్తుందన్నారు.
రూ.1,24 కోట్ల పనులకు శంకుస్థాపన
బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో రూ.95 లక్షలతో స్విమ్మింగ్ పుల్ నిర్మాణం, రూ.29 లక్షల జనరల్ ఫండ్‌తో మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల విక్రయం కోసం స్టాళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా బల్దియా ఆవరణలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్‌తో పాటు వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫొటో సెషన్ కొనసాగింది.
ఆత్మీయ వీడ్కోలు..
గ్రేటర్ వరంగల్ పాలకమండలికి బుధవారం సాయంత్రం ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్‌లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. సభ్యులకు మెమొంటో అందించి శాలువా కప్పి సత్కరించారు.
మనుషులా.. గాడుదులా?
కౌన్సిల్ సమావేశ మందిరంలో తాను కూర్చునే సీటు వద్ద తన నేమ్ ప్లేట్ పెట్టకుండా తనను అవమానపర్చారని ఎమ్మెల్సీ సారయ్య అసహనం వ్యక్తం చేశారు. ‘మనుషులా గాడుదులా’ అంటూ సంబోధించడం చర్చనీయాంశంగా మారింది.
మరింత అభివృద్ధి చేస్తాం..
వరంగల్ నగరాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం. నగరాభివృద్ధిలో భాగంగా ఎయిర్‌పోర్ట్, కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్‌టైల్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి. ప్రజ లకు మెరుగైన జీవన వాతావరణం అందిస్తాం.
– ఎంపీ కడియం కావ్య
మౌలిక వసతులపై ఫోకస్ పెట్టాలి
హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. నగరానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తాం. స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్లు ఆ దిశగా ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
– బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ
పదవులు కాదు.. ప్రజా సేవే లక్ష్యం
పదవులు శాశ్వతం కాదు. ప్రజల సేవే నిజమైన లక్ష్యం. ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజాసేవలో ముందుండాలి. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
– నాగరాజు, ఎమ్మెల్యే, వర్ధన్నపేట
కట్టుబడి పనిచేస్తాం..
ప్రతీ సమస్యను ప్రాధాన్యంగా తీసుకొని, వేగంగా పరిష్కరించేలా పనిచేస్తాం. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
– చాహత్ బాజ్‌పాయ్, హనుమకొండ
కలెక్టర్, బల్దియా కమిషనర్
అందరి సహకారంతో
ఆదర్శనగర నిర్మాణం
మేయర్ గుండు సుధారాణి
చివరి కౌన్సిల్‌లో రూ.76.56 కోట్ల పనులకు ఆమోదం


