వరంగల్ అర్బన్: జనగణన–2027లో భాగంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హనుమకొండ రాంనగర్‌లోని తన నివాసంలో బుధవారం సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతీ పౌరుడు స్వయంగా వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా జనగణన ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా సాగుతుందని తెలిపారు. ప్రజలంతా సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని వినియోగించుకుని ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. మే 10 వరకు నమోదు చేసుకోవచ్చని, మే 11 నుంచి ఇంటింటికీ వచ్చే ఎన్యుమరేటర్లకు ఐడీ నంబర్‌ను తెలియజేయాలని సూచించారు. దీంతో తమ వివరాలు అధికారికంగా జనగణనలో నమోదవుతాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, రెవెన్యూ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి పద్మ అవార్డును ప్రదానం చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. http:// padmaawards.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సేవలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రిక కటింగ్ ఫొటోలతో సహా (4) సెట్లు తయారు చేసి దరఖాస్తుకు జోడించి ఈనెల 25వ తేదీలోగా జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం, హనుమకొండ జిల్లా, కాకతీయ డిగ్రీ కళాశాల ఎదురుగా, ఆఫీసులో అందజేయాలని సూచించారు. నిర్ణీత తేదీ తర్వాత వచ్చిన ధరఖాస్తులు తిరస్కరించనున్నట్లు ప్రశాంత్ తెలిపారు.
హసన్‌పర్తి: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులకు కఠిన శిక్షణ పడేలా కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ మల్లారెడ్డిని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ బుధవారం అభినందించారు. కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ మల్లారెడ్డికి నగదు రివార్డు అందించారు. వంద కిలోల గంజాయి కేసులో ఐదుగురికి 20 ఏళ్ల శిక్ష పడడంలో రాజ మల్లారెడ్డి కీలక పాత్ర పోషించడంపై సీపీ అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా సీపీ సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ.. పోలీసులు, ప్రభుత్వ న్యాయవాదులు సమన్వయంతో పనిచేస్తే నిందితులకు శిక్షణ పడుతుందని చెప్పారు.
కాశిబుగ్గ: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు షీ టీం ఆధ్వర్యంలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. షీ టీం ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సునీత మాట్లాడుతూ.. కళాశాలలో ర్యాగింగ్ జరగలేదని, ఇద్దరు విద్యార్థినులు ఫోన్ విషయంలో గొడవ పడ్డారన్నారు. వెంటనే తాము వారికి నచ్చజెప్పి ఎలాంటి వివాదం లేకుండా చేశామని పేర్కొన్నారు. అలాగే బుధవారం ర్యాగింగ్ జరగలేదని సద రు విద్యార్థితో పాటు సోదరుడు కూడా యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ పోర్టల్‌కు మెయిల్ పెట్టారని ఆమె తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యిందని, కంప్లైంట్‌ను క్లోజ్ చేయండని మెయిల్‌లో పేర్కొన్నట్లు ప్రిసిపాల్ వివరించారు.
న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ కోసం మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఆస్తకిగల మైనార్టీ అభ్యర్థులు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైన్, బౌద్ద, పార్సీ) ఆన్‌లైన్ ద్వారా ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారి, షరీఫన్ మసీద్ ఎదురుగా రెండవ అంతస్తులోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


