వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్: రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌లోనే విక్రయించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ, అనుబంధశాఖల ఆధ్వర్యంలో మార్కెట్ కార్యదర్శి మల్లేశం అధ్యక్షతన రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పత్తి, మొక్కజొన్న, మిర్చి, ధాన్యం తదితర పంటలను మార్కెట్‌లో విక్రయిస్తే మద్దతు ధరతో పాటు సరుకులు విదేశాలకు రవాణా చేసే సదుపాయం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వైవీ గణేశ్, మార్కెటింగ్ హైదరాబాద్ అదనపు సంచాలకులు ఆర్.లక్ష్మణుడు, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీయల్ వరంగల్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ..
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని ఈవీఎం గోదాంను బుధవారం అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణితో కలిసి కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జాబ్‌మేళా పోస్టర్ ఆవిష్కరణ
న్యూశాయంపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 8న (శుక్రవారం) హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు.


