మరుసటి రోజే ఎప్‌సెట్
ఆదివారం దూర ప్రాంతాల నుంచి నీట్ పరీక్ష రాయడానికి వచ్చిన వారికి సోమవారం ఎప్‌సెట్ రాయడం ఇబ్బందిగా మారుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ‘జమ్మికుంట నుంచి మా అమ్మాయి లాస్యను తీసుకుని సీకేఎం కాలేజీలో పరీక్ష రాయించడానికి వచ్చాం. కేయూ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బందులు పడ్డాం’ అని అకెనపల్లి మురళీధర్ తెలిపారు. మళ్లీ సోమవారం ఎప్‌సెట్ రాయించడానికి మామునూరుకు తీసుకెళ్లడం ఇబ్బందవుతుందని, ఇప్పటికే ఎండకు అలిసిపోయామన్నారు.
● ముందుగానే చేరుకున్న విద్యార్థులు
● ఆలస్యంగా వచ్చిన ఒక విద్యార్థికి అనుమతి నిరాకరణ
కేయూ క్యాంపస్/కాశిబుగ్గ: హనుమకొండ, వరంగల్‌లో నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్)–2026 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఈ పరీక్షను 9 కేంద్రాల్లో నిర్వహించింది. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద గేట్ మూసివేసిన తర్వాత వచ్చిన ఓ విద్యార్థిని అనుమతించలేదు. వరంగల్ నిట్‌లో రెండు, హనుమకొండ కేడీసీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల (కోఎడ్యుకేషన్), కేంద్రీయ విద్యాలయం, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల, వరంగల్ సీకేఎం కళాశాల, ఎల్‌బీ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,643 మందికి 4,544 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 99 మంది గైర్హాజరైనట్లు నీట్ రెండు జిల్లాల కో–ఆర్డినేటర్ భిక్షపతి తెలిపారు. వరంగల్ దేశాయిపేట సీకేఎం కళాశాలలో 320 మంది హాజరుకాగా.. ముగ్గురు గైర్హాజరయ్యారు. సీకేఎం కళాశాలలో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పిల్లలను తీసుకుని దూర ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఇబ్బందులు పడ్డారు.


