ప్రత్యేక విద్యా వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక విద్యా వారోత్సవాలు

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ నెల 11 నుంచి ప్రత్యేక విద్యావారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విద్యావారోత్సవంలో భాగంగా రోజుకో కార్యక్రమంతో రోజువారీ షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈఓలకు జారీ చేశారు. అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యోగితారాణా ఇటీవల హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లకు, డీఈఓలకు వివిధ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రత్యేక విద్యావారోత్సవాలు, ప్రీ ప్రైమరీ తరగతులపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయ్‌లెట్స్‌ మరమ్మతులు, లేని చోట నూతన టాయ్‌లెట్స్‌ నిర్మాణం, ఎస్సెస్సీ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు రిమిడియల్‌ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను వచ్చే విద్యాసంవత్సరం వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బడిబయటి విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలన్నారు. ఈవిద్యాసంవత్సరం 2026–27లో విద్యార్థులకు షూస్‌, టై, బెల్టులు కూడా అందజేయనున్నట్లు తెలిపారు.

షెడ్యూల్‌ ఇలా..

● మే 11న పీఎంశ్రీ పాఠశాలల్లో సమ్మర్‌ క్యాంపులను ప్రారంభిస్తారు. ఈక్యాంపులో అకడమిక్‌, కోడింగ్‌, కళలు, క్రీడలు, యోగా నేర్పిస్తారు.

● 12న పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు పీఎంశ్రీ పాఠశాలల్లో రెమిడియల్‌ క్యాంపులు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహిస్తారు.

● 13న జిల్లా స్థాయిలో అందరు సర్పంచులను ఆహ్వానించి సమావేశం నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, అకడమిక్‌ కార్యక్రమాలు వివరించాల్సి ఉంటుంది.

● 14న బడిబాట కార్యక్రమం నిర్వహిస్తారు. అన్ని పాఠశాలలను శుభ్రపర్చి అలంకరించి ఇంటింటి కి ప్రవేశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులతో మెగా పీటీఎం ఉంటుంది.

● మే 15న పాఠశాలలు గ్రామ, కమ్యూనిటీ లైబ్రరీలో కార్యక్రమాలుంటాయి. పుస్తక ప్రదర్శనలు, పఠన పోటీలు నిర్వహిస్తారు.

● మే 16న మండల స్థాయిలో విద్యార్థులకు కళలు, హస్తకళలు, సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్య తదితర సాంస్కృతిక పోటీలు ఉంటాయి. పర్యావరణ హిత పదార్థాల వినియోగాన్ని ప్రొత్సహిస్తూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాల్సి ఉంటుంది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రతిభా ప్రదర్శనలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపాల్సి ఉంటుంది.

● మే 17న ప్రతీ జిల్లాలో జవహర్‌ బాలభవన్‌లో విద్యార్థులకు కళలపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

● ప్రత్యేక విద్యావారోత్సవాల నిర్వహణకు ప్రతీ జిల్లాకు నిధులు విడుదల చేస్తారని సమాచారం.

ఎస్సెస్సీ విద్యార్థులకు రిమిడియల్‌ క్యాంపులు

ఈ నెల 11 నుంచి 17 వరకు వివిధ కార్యక్రమాలు

Advertisement
 
Advertisement
Advertisement