హన్మకొండ అర్బన్: గ్రేటర్ వరంగల్ 60వ డివిజన్ వడ్డేపల్లి పరిధిలో కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి కార్పొరేటర్ దాస్యం అభినవ్‌భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం మొత్తం రూ.4,27,911 కోట్ల గ్రాంట్లను సిఫార్సు చేయగా.. అందులో వైద్య రంగానికి రూ.70,051 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వాటిలో రూ.26,123 కోట్లు పట్టణ స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా కేటాయించినట్లు వివరించారు. ఈనిధుల నుంచి రూ.1.43 కోట్లతో వడ్డేపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి వినియోగించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ మాలిక, యూపీహెచ్‌సీ సిబ్బంది, వడ్డేపల్లి వాసులు, డివిజన్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


