ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ: రాజకీయాలు, కుల మతాలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ 52వ డివిజన్ హనుమకొండ నయీంనగర్‌లో రూ.1.10 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయినేజీ పనులకు మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ చాడా స్వాతితో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనలో గణనీయమైన అభివృద్ధి సాధించామన్నారు. ఈ నెల 6న కార్పొరేటర్ల పదవీకాలం ముగియనున్నందున వారి సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. బీజేపీ నాయకులు చాడా శ్రీనివాస్ రెడ్డి, నాయకుడు అశోక్‌రావు, మాజీ కార్పొరేటర్ మేకల బాబురావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


