మెసేజ్‌ల పేరుతో మోసం.. | - | Sakshi
Sakshi News home page

మెసేజ్‌ల పేరుతో మోసం..

May 4 2026 6:49 AM | Updated on May 4 2026 6:49 AM

డబ్బులు పంపించాలంటూ రెక్వెస్ట్‌లు

కాశిబుగ్గ: సైబర్‌ నేరగాళ్ల రోజుకో రకమైన విధానాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఈజీగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా బ్యాంకుల ఖాతాలను నుంచి డ్రా చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఆదివారం ఓ చేనేత వ్యాపారిని టార్గెట్‌ చేసుకుని మెసేజ్‌ల పేరుతో నేరుగా డబ్బులు తీసుకోకుండా మిత్రుల ద్వారా గుంజడానికి యత్నించారు. సదరు వ్యాపారి వాట్సాప్‌లో ఉన్న సెల్‌నంబర్ల ఆధారంగా వారికి రిక్వెస్ట్‌ మెసేజ్‌లు పెడుతూ పోన్‌పే ద్వారా డబ్బులు తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవాడలో ఓ చేనేత వ్యాపారికి ‘మీకు గుజరాత్‌ నుంచి కొరియర్‌ వచ్చింది, మీ ఇల్లు, షాపు దొరకడం లేదు’ అంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. కొరియర్‌ బాయ్‌ మీ వద్దకు రావడానికి అడ్రస్‌ కోసం ఫోన్‌ చేయమని ఓ నంబర్‌ చెప్పాడు. దీంతో సదరు వ్యాపారి కొరియర్‌ వచ్చిందనే నమ్మకంతో గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన నంబర్‌కు ఫోన్‌ చేశాడు. ఇంకేముంది సదరు వ్యాపారి నంబర్‌ తీసుకుని అతడి సెల్‌లో ఉన్న దాదాపు 40 మంది కాంట్రాక్టు నంబర్లకు డబ్బులు అర్జెంట్‌గా కావాలంటూ మెసేజ్‌లు పెట్టడం మొదలు పెట్టాడు. ‘నాకు మీ అవసరం ఉంది, మీరు వెంటనే రూ.48 వేలు ఫోన్‌ పే ద్వారా పంపించండి. రెండు గంటల్లో మీకు రిటర్స్‌ ఇస్తా’ అంటూ మెసేజ్‌ పెట్టి నమ్మించే ప్రయత్నం చేశాడు. నా యూపీఐ లిమిట్‌ ఈరోజు పూర్తయింది. ఒక వ్యక్తికి అర్జెంట్‌గా డబ్బులు ఇవ్వాలంటూ మెసేజ్‌ పెడుతూ, పోన్‌ పే కోసం ఓ సెల్‌ నంబర్‌ కూడా ఇచ్చాడు. ఈ సమాచారం కాంట్రాక్టులో ఉన్న నంబర్లకు వెళ్లడంతో కొందరు నమ్మి డబ్బులు పంపించినట్లు తెలుస్తోది. ఓ ఇద్దరు సదరు వ్యాపారికి డబ్బులు పంపడం, పంపించిన వ్యక్తులు ఫోన్‌ చేయడంతో అనుమానం వచ్చి, జరుగుతున్న మోసాన్ని గ్రహించాడు. వెంటనే సెల్‌ సెంటర్‌కు వెళ్లి తన నంబర్‌ హ్యాక్‌ కాకుండా చేసుకున్నాడు. అనంతరం సైబర్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement