పంట పొలాల్లో అగ్ని ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

పంట పొలాల్లో అగ్ని ప్రమాదాలు

May 4 2026 6:49 AM | Updated on May 4 2026 6:49 AM

కమలాపూర్‌: పంగిడిపల్లి, కన్నూరు గ్రామాల్లోని పంట పొలాల్లో ఆదివారం భా రీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రైతులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పంగిడిపల్లిలో సుమారు40 ఎకరాల మొక్కజొన్న చేలల్లో మంటలు వ్యాపించాయి. కొంతమంది రైతులకు చెందిన మగ మొక్కజొన్న కంకులతో పాటు పైపులు, కరెంట్‌ మోటార్ల వైర్లు, మొక్కజొన్న చొప్ప దగ్ధమై సుమారు రూ. లక్ష వరకు నష్టం వాటిల్లింది. కన్నూరులో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని నాలుగైదు ఎకరాల్లో కోసి కుప్పలుగా పోసిన మగ ధాన్యంతో పాటు పశుగ్రాసం దగ్ధమైనట్లు స్థానికులు చెప్పారు. స్థానిక గ్రామ పంచాయతీ వాటర్‌ ట్యాంకర్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేసినట్లు రైతులు తెలిపారు.

హుస్సేన్‌పల్లిలో..

శాయంపేట: హుస్సేన్‌పల్లి గ్రామ శివారులోని హనుమాన్‌ దేవాలయ సమీపంలో ఆదివారం ప్రమాదవశాత్తు మొక్కజొన్న చేనుకు నిప్పంటుకుంది. మంటలు గాలికి వేగంగా వ్యాపించి పదెకరాల్లో పంట చేలను ఆవరించాయి. స్థానిక రైతులు, గ్రామస్తులు చెట్టుకొమ్మలు, గ్రామపంచాయతీ వాటర్‌ ట్యాంకర్‌తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ ఇంజన్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్‌ ఇంజన్‌ పొలాల వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో సిబ్బంది, రైతులు చెట్ల కొమ్మలు, నీటితో మంటలను ఆర్పివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement