‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చిమోశాను’ అని శ్రీశ్రీ చెప్పినట్లుగా హనుమకొండలోని ఐనవోలు మండలంలోని ఉడుతగూడెం సైతం దేశాభివృద్ధిలో భాగమవుతోంది. గ్రామస్తులకు మౌలిక వసతులు, ఆహ్లాదకర వాతావరణం, చక్కని జీవనాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీలకు ఏటా అందించే అచీవర్ అవార్డుకు గ్రామం ఎంపికైంది. వెల్లివిరిస్తున్న ఆ పల్లైపె ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.
ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని ఉడుతగూడెం గ్రామ పంచాయతీ స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో అచీవర్ అవార్డు సాధించింది. ఉడుతగూడెంలో సుమారు 800 మంది జనాభా నివసిస్తున్నారు. 494 మంది ఓటర్లున్నారు. 180 ఇళ్లు ఉండగా, ప్రతీ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ఆరు బయట మల, మూత్ర విసర్జన లేని (ఓడీఎఫ్) గ్రామంగా పేరుపొందింది. గ్రామంలో స్వయం సమృద్ధిగా సీసీ రోడ్లు నిర్మించుకున్నారు. మిషన్ భగీరథలో భాగంగా ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్‌తో స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. విద్యుత్ కనక్షన్లున్నాయి. ఇంటికో పాడి గేదె ఉండగా.. గోపాలమిత్ర కేంద్రం ఏర్పాటు చేసుకుని పశువుల ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకున్నారు. గ్రామంలో పచ్చదనం వెల్లివిరిసేలా నర్సరీ ఏర్పాటు, మొక్కల పెంపకం చేపట్టారు. 100 శాతం పన్నులు చెల్లించి గ్రామస్తులు పల్లె అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, తడిపొడి చెత్త సేకరణ తదితర పనుల ని ర్వహణలో ముందుంది. ఈ మేరకు ఉడుతగూడెంలో పర్యటించిన అప్పటి కేంద్ర బృందం అన్ని అంశాలను పరిశీలించి స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల విభాగంలో 92.5 స్కోర్ ఇచ్చింది. దీంతో ఏ+ గ్రేడ్ సాఽధించి అచీవర్ అవార్డుకు ఎంపికై ంది.
సంతోషకరం..
గ్రామంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, క్రీడా ప్రాంగణంతో పాటు నర్సరీ ఏర్పాటైంది. అయితే గతంలోనే ఓడీఎఫ్ గ్రామంగా ఉన్నది. అలాగే ఇంటికో ఇంకుడుగుంత ఉండగా.. ప్రతీ ఇంటికి నల్ల కనెక్షన్ ఉంది. నీరు, విద్యుత్ సమస్యలు లేవు. గ్రామంలో సరిపడా అంతర్గత సీసీ రోడ్లు ఉన్నాయి. ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడం సంతోషదాయకం. – తోట రాజేందర్, గ్రామస్తుడు
అచీవర్ అవార్డుకు హనుమకొండ ఐనవోలు మండలంలోని ఉడుతగూడెం ఎంపిక
స్వయం సమృద్ధి, మౌలిక వసతుల కల్పన అంశాల్లో ఎంపిక


