కుడాలో ఏం జరుగుతోంది? | - | Sakshi
Sakshi News home page

కుడాలో ఏం జరుగుతోంది?

May 1 2026 3:58 AM | Updated on May 1 2026 3:58 AM

కుడాలో ఏం జరుగుతోంది?

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)లో గతంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిధుల దుర్వినియోగంపై గతంలో పలువురిపై ఆరోపణలు రాగా, విచారణలు సైతం జరిగాయి. తాజాగా ‘కుడా’లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మాజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ బాదం వెంకటేశ్వర్లుపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఇప్పుడు చివరి దశకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు ప్రారంభిస్తూ తుది విచారణకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

అవినీతి, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన..

వెంకటేశ్వర్లు అవినీతి చర్యలకు పాల్పడినట్లు, అలాగే తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ (ప్రవర్తన) నియమావళి–1964లోని రూల్‌ 3(1), 3(2), 3(3లను ఉల్లంఘించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగిగా సమగ్రత, విధి పట్ల నిబద్ధత, సముచిత ప్రవర్తన వంటి ప్రాథమిక నిబంధనలను అతిక్రమించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై చార్జ్‌ మెమో జారీ చేసి క్రమశిక్షణ చర్యలు ప్రారంభించారు.

ఏసీబీ నివేదికల ఆధారంగానే..

వెంకటేశ్వర్లు వ్యవహారంలో యాంటీ కరప్షన్‌ బ్యూరో (ఏసీబీ) నివేదికలు కీలకంగా మారాయి. 2015లో వరంగల్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ అక్టోబర్‌ 15, 16 తేదీల్లో నివేదికలు సమర్పించగా, 2017 జనవరి 3న, 2023 సెప్టెంబర్‌ 12న, అలాగే 2026 ఫిబ్రవరి 18న ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ నుంచి నివేదికలు అందాయి. ఈ నివేదికల ఆధారంగానే ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. కాగా, ఈ విచారణలో పురపాలక పరిపాలన శాఖ, కుడా, ఏసీబీ, విజిలెన్స్‌ కమిషన్‌ కీలకపాత్ర పోషిస్తున్నాయి. అధికారిక ఉత్తర్వుల ప్రతులను సంబంధిత శాఖలకు పంపడంతోపాటు కేసు పురోగతిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. మొత్తంగా ఏసీబీ నివేదికల ఆధారంగా ప్రారంభమైన ఈ కేసు ఇప్పుడు పూర్తిస్థాయి విచారణ దశలోకి ప్రవేశించింది.

విచారణాధికారిగా అజిత్‌ రెడ్డి..

ఈ కేసు సమగ్ర విచారణ కోసం ‘కుడా’లో చీఫ్‌ ప్లా నింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఇ.అజిత్‌ రెడ్డినే విచారణాధికారిగా ప్రభుత్వం నియమించింది. తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ (క్లాసిఫికేషన్‌, కంట్రోల్‌ అండ్‌ అప్పీల్‌) రూల్స్‌–1991లోని రూల్‌ 20(2) ప్రకారం విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. విచారణాధికారి ఉత్తర్వులు అందిన తేదీ నుంచి మూడు నెలలలోపు విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని, గడువులోగా నివేదిక ఇవ్వకపోతే దానిని ప్రభుత్వం ‘అత్యంత తీవ్రంగా’ పరిగణిస్తుందని ఉత్తర్వుల్లో హెచ్చరించింది. కాగా, విచారణలో భాగంగా నిందితుడు బాదం వెంకటేశ్వర్లు 2024 ఫిబ్రవరి 14న లిఖితపూర్వక వివరణ సమర్పించినప్పటికీ.. మరోసారి తన వాదన వినిపించే అవకాశం కల్పించారు.

మాజీ ఇంజనీర్‌పై

అవినీతి ఆరోపణలు..

భారీ అక్రమాలు జరిగినట్లు

ఏసీబీ నివేదిక

మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు

ఆ అథారిటీ సీపీఓకే విచారణ బాధ్యతలు

ఒక్కొక్కటిగా అవినీతి,

అక్రమాలు బట్టబయలు

Advertisement
 
Advertisement
Advertisement