మామునూరు: మామునూరు ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులతో బుధవారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకుముందు రైతులనుంచి సేకరించిన 252 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం సంబంధిత అధికారులు నిర్ణయానికి వచ్చారు. రన్‌వే విస్తరణ కోసం రైతులనుంచి సేకరించిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణంతోపాటు మిగతా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు మరో మూడునెల్లో ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మామునూరుతో పాటు ఆది లాబాద్, కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామన్నారు.
హన్మకొండ అర్బన్: చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం.విజయలక్ష్మి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మొత్తం 60 సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. కోర్సు వ్యవధి మూడేళ్లు (ఆరు సెమిస్టర్లు)గా ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, జూలై 1,2026 నాటికి కనీస వయస్సు 15 సంవత్సరాలు పూర్తయ్యి ఉండి.. గరిష్ట వయస్సు 23 సంవత్సరాలుగా ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుందని వివరించారు. దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో స్వీకరిస్తారని, అవసరమైన ధ్రువపత్రాలతో కలిసి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 90300 79242 నంబర్‌లో లేదా ihithyderabad@gmail.com, klbiht2024@ gmail. com ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని కోరారు.
హన్మకొండ అర్బన్: వరంగల్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎంపీ కడియం కావ్యకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో టీజీఓ బృందం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలి పారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కోలా రాజేశ్‌గౌడ్, శ్రీనివాస్, టీజీఓ నేతలు సంతోశ్, మల్లయ్య, రాజేశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, రమేశ్, భీమ్‌రావు, పాల్గొన్నారు.
హన్మకొండ: హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈఓగా ఎం.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇక్కడ డిప్యూటీ సీఈఓగా పని చేస్తున్న బి.రవి పదోన్నతిపై ఆదిలాబాద్ జెడ్పీ సీఈఓగా బదిలీ అయ్యారు. ఈస్థానంలో ములుగు డీఆర్డీఏలో డిప్యుటేషన్‌పై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా పని చేస్తున్న ఎం.శ్రీనివాస్‌ను హనుమకొండ జెడ్పీ డిప్యూటీ సీఈఓగా నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
హన్మకొండ చౌరస్తా: గర్భిణి ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ప్రసవం తర్వాత తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని అందుకు గర్భం దాల్చినప్పటి నుంచే పౌష్టికాహారం తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. సురక్షిత మాతృ దినోత్సవం సందర్భంగా బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి వద్ద చేపట్టిన ర్యాలీని డీఎంహెచ్‌ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశు, మహిళల ఆరోగ్యానికి ఆరు అంశాలతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఆర్‌ఎంఓ మంజుల పాల్గొన్నారు.


