‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
పలు ప్రాజెక్టులపై సమీక్ష
నయీంనగర్: కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో జరుగుతున్న, రాబోయే ప్రాజెక్టులపై బుధవారం ‘కుడా’ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేశ్ రంజన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ‘కుడా’ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు. రూ.95 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించుకున్నామని, ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. కాకతీయ మ్యూజికల్ గార్డెన్, అడ్వెంచర్ పార్క్‌లు, భద్రకాళి ఆలయ మాడ వీధులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులు వేగవంతం చేయాలన్నారు. ఇందులో భాగంగా రూ.125 కోట్లతో నిర్మిస్తున్న మోడ్రన్ బస్ స్టేషన్ పనులు, ఇన్నర్ రింగ్ రోడ్ పనులు ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. భద్రకాళీ చెరువు వద్ద 80 కోట్లతో రానున్న కేబుల్ కార్, గ్లాస్ బ్రిడ్జి ప్రాజెక్టుల గురించి సమీక్షించారు. భవిష్యత్ ప్రాజెక్ట్‌లైన వరంగల్ చుట్టూ మిగిలిన 41 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. నగరంలో కొత్తగా స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్, రీజినల్ సైన్స్ సెంటర్ పునరుద్ధరణ భారీ ప్రాజెక్టుల కోసం హడ్కో నుంచి రూ.700 కోట్ల రుణంతో పాటు ప్రభుత్వం నుంచి రూ.1,000 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్‌పాయ్, సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు, అధికారులు పాల్గొన్నారు.


