వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు సమగ్రంగా వివరించేందుకు గ్రామ సభలు ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో బుధవారం గ్రామ, వార్డు సభల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించే గ్రామసభల్లో ప్రభుత్వ పథకాల వివరాలు స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారికి సభల్లో మాట్లాడే అవకాశం కల్పించి అవగాహన పెంచాలన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలపై తీర్మానం చేయాలని, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని పేర్కొన్నారు. సభల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


