జూన్‌లో ‘సూపర్‌’ స్పెషాలిటీ! | - | Sakshi
Sakshi News home page

జూన్‌లో ‘సూపర్‌’ స్పెషాలిటీ!

Mar 25 2026 7:52 AM | Updated on Mar 25 2026 7:52 AM

జూన్‌లో ‘సూపర్‌’ స్పెషాలిటీ!

సాక్షి, వరంగల్‌: ఉత్తర తెలంగాణ ప్రాంతవాసులకు నాణ్యమైన వైద్యసేవలందించేందుకు చేపట్టిన వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు జెట్‌స్పీడ్‌లో కొనసాగుతున్నాయి. వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో రూ.1,371 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణంలో 400 మంది కార్మికులు మూడు షిఫ్ట్‌లుగా పనిచేస్తున్నారు. 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్‌ సర్వీసులు ఈ ఏడాది జూన్‌లో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో పనులు పూర్తికావొస్తున్నాయి. ఈ పనులు ప్రారంభమైన సరిగ్గా ఐదేళ్లకు అందుబాటులోకి రానున్న ఈ ఆస్పత్రిలో పనిచేసేందుకు డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్‌ వెలువడే చాన్స్‌ ఉందని జిల్లా వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది. 1500 పడకల ప్రస్తుత ఎంజీఎం ఆస్పత్రి ఇక్కడికి తరలుతుంది. మరో 500 పడకలు (కార్డియాలాజీ, న్యూరాలజీ, పిడియాట్రిక్‌ సర్జరీ, గ్యాస్టో ఎంట్రాలాజీ, కార్డియోథెరపీ, నెఫ్రాలజీ, యూరాలజీ) ఏర్పాటుతో రెండువేల పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. దీనిద్వారా హైదరాబాద్‌కు రెఫరల్‌ వైద్యం తగ్గి, ఇక్కడే అన్ని వైద్య సేవలు అందనున్నాయి. హైదరాబాద్‌కు వెళ్లనవసరం లేకుండా అవయవమార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే జరగనున్నాయి. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల వేళ ఈ ఆస్పత్రి ప్రారంభం కానుండడం కూడా అధికార పార్టీ కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశముందన్న చర్చ ఉంది.

వేలాది మందికి వైద్యసేవలు.. ఉపాధి అవకాశాలు..

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 2021 జూన్‌లో ప్రారంభమయ్యాయి. 2022లో ఆకృతి (డిజైన్‌) మార్చి అంచనా వ్యయం పెంచారు. 2024 మార్చికి అందుబాటులోకి వస్తుందనుకుంటే ప్రభుత్వం మారడం, డిజైన్ల మార్పు, అంచనాల పెంపు, దానిపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ తదితర కారణాలతో కాస్త ఆలస్యమయ్యాయి. ఈ నిర్మాణ పనులు మొదలైనా ప్రారంభానికి మాత్రం ముహూర్తం కుదరలేదు. అయితే ఇక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు తరచూ ఈ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండడం...వెరసి ఈ ఆస్పత్రి తుది దశ నిర్మాణ పనులు వేగిరంగా సాగుతున్నాయి. జూన్‌ నాటికి పూర్తి పనులు చేసి ఆస్పత్రి పనులు ప్రారంభించేలా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడంతోపాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కే అవకాశముంది.

జెట్‌స్పీడ్‌తో ఆస్పత్రి నిర్మాణ పనులు

అందుబాటులోకి రానున్న

24 అంతస్తుల భవనం

త్వరలోనే డాక్టర్లు, ఇతర సిబ్బంది

నియామకానికి నోటిఫికేషన్‌

ఉత్తర తెలంగాణవాసులకు

అందనున్న మెరుగైన వైద్యసేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement