కాంగ్రెస్‌కు పూర్తి కమిటీలు ఎప్పుడు? | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు పూర్తి కమిటీలు ఎప్పుడు?

Mar 22 2026 2:12 AM | Updated on Mar 22 2026 2:12 AM

కాంగ్రెస్‌కు పూర్తి కమిటీలు ఎప్పుడు?

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

ధికార కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో మాత్రం ఇంకా పూర్తిస్థాయి కార్యవర్గం, కమిటీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్‌ ప్రెసిడెంట్లు, జనరల్‌ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృతస్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 2025, నవంబర్‌ 22న ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాతో ఆగిపోయింది. పూర్తిస్థాయి కమిటీలకు మోక్షం కలగకపోగా, పార్టీ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ కొనసాగుతోంది.

నాలుగు నెలల క్రితమే డీసీసీ అధ్యక్షులు..

డీసీసీ అధ్యక్షుల్లో ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాల్లో ఇద్దరు షెడ్యూల్‌ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్‌, ఒక షెడ్యూల్‌ తెగలకు చెందిన వారికి పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ‘కుడా’చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డిని నియమించగా, వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్‌ అయూబ్‌కు అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో కీలక ప్రజాప్రతినిధులు అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా లకావత్‌ ధన్వంతి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్‌, మహబూబాబాద్‌కు ఎమ్మెల్యే మురళి నాయక్‌ భార్య ఉమలను ఖరారు చేయగా, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రెండోసారి పైడాకుల అశోక్‌కు దక్కింది. డీసీసీ అధ్యక్షుల సంధర్భంగా హనుమకొండ, ములుగు జిల్లాలు మినహా.. మిగతా నాలుగు జిల్లాల్లో సీనియర్‌లు అలకకు గురికాగా, కేడర్‌లో తర్జన భర్జన జరిగింది. ఈ నేపథ్యంలో అందరినీ అధిష్టానం బుజ్జగించింది. తాజాగా పూర్తిస్థాయి కమిటీల కూర్పు విషయం వచ్చే సరికి మళ్లీ రాజకీయ సిఫారసులు పెరగడం తలనొప్పిగా మారుతుందన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది.

జంబోజెట్‌ జాబితా... అందుకే పెండింగ్‌?

నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్‌ అధిష్టానం ఆరు జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ఇంకా పెండింగ్‌లోనే పెట్టింది. దీంతో స్థానిక కేడర్‌లో గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఫిబ్రవరి చివరి వారంలోనే జిల్లాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు తదితర పోస్టులకు టీపీసీసీకి జాబితా పంపించనట్లు తెలిసింది. ఉగాది సందర్భంగా 14 జిల్లాల కమిటీలను ప్రకటించిన అధిష్టానం ఆరు జిల్లాల కమిటీలను మాత్రం ప్రకటించలేదు. జిల్లా కమిటీల్లో అన్ని పోస్టులు కలిపి 30 నుంచి 50 మంది దాటకుండా ఉండేలా జాబితా రూపొందించాల్సి ఉండగా.. అంతకుమించి పంపడం వల్ల వడపోత చేస్తున్నారని చెబుతున్నారు. వరంగల్‌, జనగామ జిల్లాల్లో కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల మధ్య పొసగకపోవడం వల్ల అక్కడినుంచి కూడా జంబోజెట్‌ జాబితా వెళ్లినట్లు తెలిసింది. ఆ జాబితాలు అధిష్టానం పరిశీలనలోనే ఉండగా.. హనుమకొండ, ములుగు జిల్లాల జాబితాపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన వెలువడవచ్చంటున్నారు. కమిటీలు ఆలస్యం కావడం పట్ల పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చాలాచోట్ల గ్రూప్‌ రాజకీయాలు, కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు, స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోటీ కారణంగా కమిటీలు ఆలస్యం అవుతున్నాయన్న చర్చ జరుగుతోంది.

డీసీసీ అధ్యక్షులను

నియమించి నాలుగు నెలలు

పూర్తిస్థాయి కార్యవర్గంపై ఇంకా అస్పష్టత

పొరుగు జిల్లాల్లో కార్యవర్గం, కమిటీల ఖరారు

ఉమ్మడి జిల్లాలో ముందుకు కదలని పరిస్థితి

ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement