● మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్
● నగరంలో ముఖ్య కార్యకర్తల సమావేశం
హసన్‌పర్తి: ‘స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వల్లే నేను పార్టీ మారాను. మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ ఆహ్వానం మేరకు తిరిగి సొంత గూటికి చేరాను. అని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వర్ధన్నపేట డివిజన్ పరిధి 13 డివిజన్లలో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని 1, 2వ డివిజన్ బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నగరంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సర్వేల ఆధారంగా గెలుపు అవకాశాలు ఉన్నవారికే కార్పొరేటర్ టికెట్ ఇస్తామని చెప్పారు. కష్టపడి పనిచేసిన వారికే పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లావుడ్య రవి, డివిజన్ అధ్యక్షుడు నరేడ్ల శ్రీధర్, గండు అశోక్ యాదవ్, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, గనిపాక విజయ్‌కుమార్, పీఏసీఎస్ మాజీ వైస్ ప్రసిడెంట్ నన్నబోయిన కుమార్ యాదవ్, ప్రమోద్, దేవేందర్, లోకేశ్, నంది శ్రీనివాస్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
డీటీఎఫ్ రెండు జిల్లాల బాధ్యులు
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 8.2 శాతం నిధులు కేటాయించడం అన్యాయమేనని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్, కె.యాకయ్య, జి.ఉప్పలయ్య, గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనెఫెస్టోలో విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం శోఛనీయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుమీద కొన్ని పాఠశాలలపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రధాన స్రవంతి పాఠశాలలను నిర్లక్ష్యం చేయడం సరికాదని తెలిపారు. విద్యారంగానికి కేటాయించిన నిధుల విషయంపై పునఃసమీక్షించి కనీసం 20 శాతం నిధులు కేటాయించి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ గడువు ముగిసి 32 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు రిపోర్ట్ తెప్పించుకోకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.


