రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
కాశిబుగ్గ: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్‌లోని 19వ డివిజన్ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో బల్దియా నిధులు రూ.29.70 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ ఫ్లోరింగ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆలయంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల ప్రాశస్త్యాన్ని కాపాడుతూ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాలని ఆమె సూచించారు. కల్యాణ మండపం ఏర్పాటు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం...
శ్రీ సీతారామాంజనేయ, హరిహర పుత్ర దేవాలయానికి తాత్కాలికంగా నియమించిన ఐదుగురు ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. మోతీలాల్ నాయక్, లకుం భాస్కర్, కుడికాల కోటేశ్వర్, పోతన లక్ష్మీనర్సయ్య, వెలిశాల మధుమతి ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు. వీరు ఆలయంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాల వరకు ధర్మకర్తలుగా వ్యవహరించనున్నారు.


