వెండి ఆభరణాల దొంగ అరెస్ట్
రామన్నపేట : ఇంతేజార్‌గంజ్ పీపీఎస్ పరిధిలో ఈ నెల 29న వెండి ఆభరణాలను అపహరించిన దొంగను పట్టుకున్నట్లు వరంగల్ ఏసీపీ శుభం ప్రకాశ్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన పంకజ్‌యాదవ్ తన అనుచరులు విమల్‌యాదవ్, ముఖేష్ సోనీకు ఐదు కిలోల వెండి ఆభరణాలు అప్పగించి వరంగల్‌లో విక్రయించి రావాలని సూచించారు. దీంతో ఈ నెల 29వ తేదీన విమల్, సోనీ ఆభరణాలతో హనుమకొండకు చేరుకుని ఆటోలో వరంగల్ వైపునకు ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో వెండి ఆభరణాల విషయం గురించి మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్.. విమల్‌యాదవ్, ముఖేష్ సోనీ ఆటో దిగిన వెంటనే వెండి ఆభరణాలు ఉన్న బ్యాగుతో పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోను గుర్తించి అపహరించిన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని కాశిబుగ్గ చెందిన ఆటో డ్రైవర్ మెరుగు వెంకట్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.


