ఫాగింగ్.. ఫ్రాడింగ్!
మామూళ్లు ఇలా..
దోమల నియంత్రణ పేరిట ఏటా రూ.7 కోట్లు ఖర్చు
‘దోమలతో బతకలేకపోతున్నాం. చలికాలం కూడా ఫ్యాన్ కిందే ఉండాల్సి వస్తోంది. రోజూ సాయంత్రం ఇంట్లో వేపాకుతో పొగ వేస్తున్నాం. లేకపోతే దోమలు నిద్రపోనివ్వవు’ అని దర్గా కాజీపేటకు చెందిన మహమ్మద్ జరీనా ఆవేదన వ్యక్తం చేసింది.
..ఇది ఒక్క జరీనా పరిస్థితే కాదు. నగరంలోని ప్రతీ కుటుంబం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. రోజురోజుకూ దోమలు వృద్ధి చెందుతుండడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పాలకులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్ అర్బన్: దోమల నియంత్రణ పేరిట కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన అర్బన్ మలేరియా అధికారి, పర్యవేక్షకులు ఎక్కడికక్కడ అక్రమాలకు పాల్ప డుతూ అందినకాడికి దండుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. మహా నగరంలో ప్రజారోగ్య పరిరక్షణ ఉందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వతో దోమల వృద్ధి అధికమైంది. దోమ కాటుతో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
ఫాగింగ్‌తో ప్రయోజనమెంత?
దోమల నివారణకు నగర వ్యాప్తంగా ప్రతీ రోజు 66 డివిజన్లలో 8 పెద్ద ఫాగింగ్ యంత్రాలు, 34 హ్యాండ్ యంత్రాల ద్వారా నిత్యం ఫాగింగ్ జరగాలి. ఇందుకోసం పెద్ద యంత్రాలకు 16 మంది, చిన్న యంత్రాలకు 34 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఈ పెద్ద పొగ మిషన్లకు రోజుకు 50 లీటర్లు, హ్యాండ్ యంత్రాలకు 5 లీటర్లతో పాటు పెట్రోల్ లీటరు చొప్పున కూపన్లు పంపిణీ చేస్తుంటారు. ఇలా ఇంధనం పేరిట ఒక్కో యంత్రానికి రోజుకు పెద్ద మిషన్‌కు రూ.49 వేలు, చిన్న యంత్రాలకు రూ.20,500, చొప్పున సుమారు రూ.70 వేలు వెచ్చిస్తున్నారు. ఏడాదంతా ఇంధనం పేరిట మొత్తం రూ.2.10 కోట్లు కాగా, ఎంఎల్, కిరోసిన్, కెమికల్స్ కోసం రూ.1.50 కోట్లు. వీరి వేతనాలు రూ.కోటి చొప్పున చెల్లిస్తున్నారు. ఇలా రూ.4.60 కోట్లు, దోమల నియంత్రణ కోసం క్షేత్రస్థాయి కార్మికులకు రూ.1.98 కోట్లు, ఇతరుల వేతనాలతో కలిపి మొత్తం వీటి పర్యవేక్షణ సిబ్బంది జీతభత్యాలు కలిపి ఏడాదికి దోమల నియంత్రణ కోసం రూ.7 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో దోమల బెడద అరికట్టడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలివ్వడం లేదు. ఈవ్యవహారంపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.
కానరాని కార్మికులు
పారిశుద్ధ్య కార్మికులు దోమలు వృద్ధి చెందకుండా నిత్యం అన్ని డివిజన్లలో పర్యటించాలి. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో చెరువులు, నాలాల్లో, డ్రెయినేజీల్లో మందు స్ప్రే చేయాలి. ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, బావుల్లో రసాయనాలు వేయాలి. 90 మంది కార్మికులు తిరుగుతున్న దాఖలాలు నామామాత్రమే. ఉదయం 5గంటలకు ఫేస్ హాజరు వేసి మధ్యాహ్నం 1 గంట వరకు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, హాజరు వేసుకుని, క్షేత్ర స్థాయిలోకి వెళ్లి అప్పుడప్పుడు నోట్ బుక్కుల్లో కాలనీవాసుల నుంచి సంతకాలు తీసుకుని ఇళ్లల్లోకి జారుకుంటున్నా రు. డివిజన్ల వారీగా కార్మికులు చేస్తున్న పనులు భూతద్దంలో వెతికినా కనిపించట్లేదని నగరవాసులు పేర్కొంటున్నారు.
చర్యలు తీసుకుంటాం..
డీజిల్, పెట్రోల్ కూపన్లు రోజు వారీగా ఫాగింగ్ యంత్రాలకు సరిపడా జారీ చేస్తున్నాం. తక్కువ ఇంధనం పోస్తున్నారనే విషయం నా దృష్టికి రా లేదు. ఏమైనా లోపాలుంటే చర్యలు తీసుకుంటా.
– రాజారెడ్డి, అర్బన్ మలేరియా ఇన్‌చార్జ్ బయాలజిస్ట్
8 పెద్ద ఫాగింగ్ యంత్రాలకు రోజు 50 లీటర్ల డీజిల్, 1 లీటరు పెట్రోల్ కూపన్లు ఇవ్వాలి. కానీ, కూపన్లు జారీ చేసిన పెట్రోల్ బంక్‌లో 25 లీటర్ల డీజిల్ మాత్రం పోస్తున్నారు. అందుకు గాను ప్రతీ ఫాగింగ్ డ్రైవర్‌కు వారానికి రూ.3 వేలు చెల్లిస్తున్నారు. ఇక హ్యాండ్ ఫాగింగ్ యంత్రానికి 5 లీటర్ల డీజిల్, లీటరు పెట్రోల్ పోస్తారు. అందుకు ప్రతీ కార్మికుడు ఫాగింగ్ చేసినా, చేయకపోయినా నెలకు హెల్త్ ఇన్‌స్పెక్టర్లకు రూ. 5 వేల చొప్పున చెల్లించాలి. ఈ వ్యవహారంలో కార్మికుడి నుంచి విభాగం ఉన్నతాధికారి వరకు నెలనెలా దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులు ఈవిషయంపై దృష్టిసారిస్తే మరి కొన్ని నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
డీజిల్, పెట్రోల్ రూపంలో
ప్రజాధనం పక్కదారి!
మందుల కొనుగోళ్లలో మాయ
వృద్ధి చెందుతున్న దోమలు..
రోగాలబారిన పడుతున్న ప్రజలు
ఫాగింగ్.. ఫ్రాడింగ్!


