సినిమాకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
● 25 తులాల బంగారు ఆభరణాలు చోరీ
హసన్‌పర్తి: సినిమాకు వెళ్లొచ్చేసరికి దుండగులు ఆ ఇంటిని గుల్ల చేశారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కేయూ పీఎస్ పరిధిలోని వెంకటేశ్వరకాలనీ–5లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన ఆకాశ్ శ్రీకార్ ఓ ప్రైవేట్ ఫైనాన్స్‌లో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కుటుంబీకులతో కలిసి సినిమాకు వెళ్లాడు. తిరిగి ఇంటికొచ్చే సరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలో ఉన్న సుమారు 25 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. బాఽధితుడు వెంటనే కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, ఇన్‌స్పెక్టర్ రవికుమార్ ఘటనాస్థలిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జాగిలాలతో గాలించారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది.


